కేసీఆర్‌కే ఝలక్.. ఆయన మాట్లాడుతుండగా..
- IndiaGlitz, [Sunday,November 29 2020]
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎల్బీస్టేడియంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. కానీ ముగ్గురు కీలక మంత్రులు సభకు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేసీఆర్ మాట్లాడుతుండగా.. సొంత పార్టీ నేతలే ఝలక్ ఇవ్వడం షాకింగ్‌గా మారింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకు రావాల్సి వచ్చింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఫైనల్‌గా కేసీఆర్ రంగంలోకి దిగారు. భారీ బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ సభకు మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి మాత్రం హాజరుకాలేదు. ముఖ్యంగా హరీష్‌రావు టీఆర్ఎస్ పార్టీకి బ్యాక్ బోన్ వంటివారు. ఆయన గైర్హాజరడం ఆసక్తికరంగా మారింది. సరే ఇదంతా వదిలేస్తే.. కేసీఆర్ సభలో మాట్లాడుతుండగా 130వ డివిజన్ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడం విస్మయానికి గురి చేస్తోంది. ‘మన పాలన మనకే అన్నావ్.. మన పదవులు మనకే అన్నావ్’ అనే బ్యానర్లను ప్రదర్శిస్తూ తెలంగాణేతరులకు బీఫారాలు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను బయటకు పంపి పరిస్థితిని అదుపు చేయాల్సి వచ్చింది.