హీరో విశాల్ పందెంకోడితో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరో మాస్, యాక్షన్ చిత్రాల్లోనే ఎక్కువగా నటించాడు. అయితే ఈ మధ్య పంథాను మార్చి కథా బలమున్న సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఎంత డిఫరెంట్ సినిమాలు చేసినా విశాల్ అంటే మాస్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు గుర్తుకు వస్తాయి. ఇలాంటి ఇమేజ్ ఉన్న ఓ హీరోతో పూర్తిస్థాయి యాక్షన్ సన్నివేశాలతో సుందర్.సి తెరకెక్కించిన సినిమాయే `యాక్షన్`. టైటిల్‌ను చూస్తేనే సినిమా ఎలా ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు. సినిమా ట్రైలర్‌లోనూ అదే విషయాన్ని చిత్ర యూనిట్ చెప్పింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంది? అనే విషయం తెలియాలంటే కథేంటో చూద్దాం.
కథ:
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సయ్యాద్ ఇబ్రహీం మాలిక్(కబీర్ దుహన్ సింగ్) పాకిస్థాన్‌లో తలదాచుకుని ఉంటాడు. అతను ఇండియాలో ఓ భారీ విధ్వంసానికి కుట్ర చేస్తాడు. అందులో భాగంగా నేషనల్ లీడర్ గుప్తాను ఓ బాంబ్ బ్లాస్ట్‌లో చంపేస్తాడు. ఆ నేరాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి తనయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి(రామ్‌కీ)పై నెట్టేస్తాడు. దాంతో రామ్‌కీ ఆత్మహత్య చేసుకుంటాడు. ముఖ్యమంత్రి చిన్న కొడుకు ఆర్మీ ఆఫీసర్ సుభాష్(విశాల్) ఈ బాంబ్ బ్లాస్ ఎందుకు జరిగింది? ఏం జరిగింది? అనే విషయాలను ఆరా తీస్తూ వెళతాడు. అతనికి తోడుగా దియా(తమన్నా) నిలుస్తుంది. ఇద్దరూ కలిసి ఓ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంటారు? ఆ నిర్ణయమేంటి? దాని వల్ల సుభాష్, దియాలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు? అసలు మీరా ఎవరు? సుభాష్ అన్నయ్యది హత్యా? ఆత్మహత్యా? అనే నిజాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
సినిమా ఎలా ఉండబోతుందనేది టైటిల్ చూస్తేనే అవగతం అవుతుంది. అదే విషయం సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్‌లోనూ ఎలివేట్ చేశారు. కమర్షియల్ సినిమాలను, అడపా దడపా హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ సుందర్.సి ఓ ఎక్స్‌పెరిమెంట్ తరహాలో పూర్తిస్థాయి యాక్షన్ మూవీగా తెరకెక్కించాడు. సినిమాను చూసిన ప్రేక్షకుడికి ఇంత భారీ సినిమాను 60 కోట్లలో ఎలా తీశారనిపించేలా పక్కా యాక్షన్ పంథాలో తెరకెక్కించారు. సుందర్.సి కథ, కథనంలో కొత్తదనం లేకపోయినా, రెండు, మూడు ట్విస్టులను బేస్ చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రధానంగా ఈ సినిమా యాక్షన్ ను బేస్ చేసుకునే తెరకెక్కింది. టర్కీలో తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ హైలైట్‌గా అనిపిస్తాయి. అలాగే ఇంటర్వెల్ ఫైట్ సీన్ హైలైట్‌గా అనిపిస్తుంది. డుడ్లీ కెమెరా పనితనం బావుంది. ఇక యాక్షన్ హీరోగా విశాల్ తనేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. యాక్షన్ సీన్స్‌తో తను ప్రానం పెట్టి చేసినట్లు సినిమా చూస్తేనే అర్థమైపోతుంది. ఇక తమన్నా కూడా పూర్తిస్థాయి యాక్షన్ హీరోయిన్‌గా మెప్పించింది. వీరిద్దరూ చేసిన యాక్షన్ సీన్సే సినిమాకు ప్రధాన బలంగా మారాయి. ఇక ఐశ్వర్య లక్ష్మి, రామ్‌కీ, యోగిబాబు, ఆకాంక్ష తదితరులు వారి వారి పాత్రల మేర చక్కగా నటించారు. సినిమా ఫస్టాఫ్ ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలతో రక్తికడుతుంది. ఇక సెంకడాఫ్‌లో టర్కీలో సన్నివేశాలు, యాక్షన్ పార్ట్ ఉంటుంది. అయితే సెకండాఫ్ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే బర్డ్ ఆఫ్ బ్లడ్‌ను స్టైల్లో ఉండటం. అలాగే రీసెంట్‌గా విడుదలైన చాణక్య సినిమాలోని బాడీ డబుల్ పాయింట్స్ అన్నీ సినిమాలో ఉన్నాయి. ఇవి చూడని ప్రేక్షకుడికి సినిమాలోని యాక్షన్ పార్ట్, ట్విస్టులు నచ్చుతాయి. ఇవి చూసేసి ఉంటే కథలో యాక్షన్ తప్ప చూడడానికేం కనపడదు.
చివరగా.. యాక్షన్.. ఫైట్స్ ప్రధాన బలంగా రూపొందిన థ్రిల్లర్
Comments