చాలా సందర్భాల్లో సినిమా అనేది కాంబినేషన్స్‌ను నమ్మి తీస్తుంటారు. అలాంటి ప్రయత్నంలో భాగంగా చేసిన సినిమాయే `ఆచారి ఆమెరికా యాత్ర`. ఇంతకు మంచు విష్ణు, డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి కాంబోలో వచ్చిన ఈడోరకం ఆడోరకం, దేనికైనా రెడీ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అలాగే సీనియర్ యాక్టర్ బ్రహ్మానందంతో ఢీ, దూసుకెళ్తా సినిమాల్లో మంచు విష్ణు కామెడీ ట్రాక్ ప్రేక్షకులను నవ్వించింది. ఈ రెండు హిట్ కాంబినేషన్స్‌ను కలిసి చేసిన ఆచారి అమెరికా యాత్ర ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో తెలుసుకోవాలంటే కథేంటో చూద్దాం.
కథ:
హోమాలు, యాగాలు చేసే అప్పలాచారి(బ్రహ్మానందం)కి కృష్ణమాచారి(మంచు విష్ణు) ప్రియశిష్యుడు. వీరికి ప్రవీణ్, ప్రభాస్ శ్రీనులు తోడుగా ఉంటారు. ఓ సందర్భంలో ఊరిలోని పెద్ద వ్యక్తి రాజుగారు(పరదీప్ రావత్) ఇంట్లో సుదర్శన హోమం చేయడానికి అప్పలాచారి, కృష్ణమాచారి అండ్ కో వెళతారు. హోమం మధ్యలోనే ఇంటి పెద్ద దిక్కు (కోట శ్రీనివాసరావు) చనిపోవడంతో హోమం రసాబాస అవుతుంది. రాజుగారి మనుషులు కృష్ణమాచారిని, అప్పలాచారి సహా అందరినీ చంపేయాలని వెంట పడుతుంటారు. వారికి భయపడి కృష్ణమాచారి ఇచ్చిన సలహాతో అందరూ అమెరికా చేరుకుంటారు. అక్కడ ఓ గుళ్లో ఉద్యోగం వస్తుంది. ఓ పెళ్లి ముహూర్తం చూడటానికి వెళ్లిన వారికి అక్కడ రేణుక(ప్రగ్యా జైశ్వాల్) కనపడుతుంది. ఆమె కృష్ణమాచారిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడ నుండి అసలు కథ ప్రారంభమవుతుంది. అసలు రాజుగారు మనుషులు కృష్ణమాచారిని ఎందుకు చంపాలనుకుంటారు? కృష్ణమాచారికి, రేణుకకు ఉన్న రిలేషన్ ఏంటి? అసలు కృష్ణమాచారి అమెరికా ఎందుకు వస్తాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
ఇందులో నటీనటులు గురించి చెప్పాలంటే మంచు విష్ణు తన పాత్రకు న్యాయం చేశాడు. కృష్ణమాచారిగా సన్నివేశాలకు తగినట్లు కామెడీని పండించే ప్రయత్నం చేశాడు. కాస్త డిఫరెంట్ పాత్రలో మంచు విష్ణు ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నం బావుంది. అయితే విష్ణు క్యారెక్టర్‌ను ఇంకాస్త చక్కగా డిజైన్ చేసుంటే బావుండేదనిపించింది. అలాగే ప్రగ్యాజైశ్వాల్ పాత్రలో ఒకే అనిపించింది. లుక్ పరంగా చూడటానికి ఓకే. కానీ పెర్ఫామెన్స్ పరంగా ఆమెకు స్కోప్ లేని పాత్రలో మరోసారి నటించింది. బ్రహ్మానందం కామెడీ యాంగిల్‌లో కొత్త దనం వెతికినా కనపడదు. ఆయన కామెడీ సీన్స్‌ను ఆయనే మళ్లీ చేస్తే ఎలా.. ఎదైనా కొత్త చేస్తే బావుండేదనిపించింది.
ఇక ప్రరవీణ్, ప్రభాస్ శ్రీను, సుప్రీత్, సురేఖావాణి, పోసాని, సత్యకృష్ణ, విద్యుల్లేఖా రామన్, అనూప్ సింగ్, రాజా రవీంద్ర అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చెప్పాలంటే దర్శకుడు నాగేశ్వరరెడ్డి నుండి ఆశించిన మినిమం కామెడీ సినిమాలో కనపడదు. రెఢీ సినిమాను అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో తీసినట్టు అనిపిస్తుంది. కామెడీ సినిమా అయినా.. ఎక్కడా ప్రేక్షకుడు మనస్ఫూర్తిగా నవ్వుకోడు. ఇలాంటి ఆసక్తిలేని కామెడీ ట్రాక్‌తో సినిమా ఎందుకు చేశాడో దర్శకుడికే తెలియాలి. తమన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ పూర్‌గా ఉన్నాయి.
బోటమ్ లైన్: ఆచారి అమెరికా యాత్ర.. వృథా ప్రయత్నం
Comments