3 సింహాల మాయం కేసు నిందితులు ఇలా దొరికిపోయారట..

  • IndiaGlitz, [Thursday,January 21 2021]

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కనకదుర్గమ్మ రథంపై మూడు వెండి సింహాల మాయం కేసు ఓ కొలిక్కి వచ్చినట్టే తెలుస్తోంది. ఈ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే యువకుడితోపాటు మరో బంగారం షాపు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వెండి రథంపై సింహాల ప్రతిమలు మాయమైనట్టు గుర్తించారు. ఈ కేసు సంచలనంగా మారడంతో పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. ఈ కేసుకు సంబంధించి దాదాపు 40 మంది పాత నేరస్థులను విచారించారు.

ఈ కేసులో అరెస్ట్ చేసిన బాలకృష్ణ అనే యువకుడితోపాటు మరో బంగారం షాపు యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు సమాచారం. బాలకృష్ణ.. దేవాలయాల్లో చోరీలు చేయడంలో దిట్ట అని తెలుస్తోంది. అతడు విజయవాడ వచ్చి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న క్రమంలో ఈ వెండి విగ్రహాలు అతని కంటపడినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే వాటిని మాయం చేశాడు. తూర్పుగోదావరి జిల్లా తుని తీసుకెళ్లి, అక్కడ ఓ జువెలరీ యజమానికి విక్రయించినట్టు సమాచారం. ఆ యజమాని వాటిని వెంటనే కరిగించేశాడు. ఈ కేసులో అసలు నిందితులు చాలా విచిత్రంగా బయటపడినట్టు తెలుస్తోంది.

ఓ చోరీ కేసులో పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు విచారించగా, మూడు సింహాల కోణం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడి పోలీసులు ఇక్కడ ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందానికి సమాచారం ఇచ్చారు. విజయవాడ నుంచి ఒక ప్రత్యేక బృందం పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లి... ప్రధాన నిందితుడితోపాటు జువెలరీ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిద్దరినీ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. ఈ కేసు చాలా వరకు కొలిక్కి వచ్చిందని సమాచారం. రెండు మూడు రోజుల్లో వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయని ఇంద్రకీలాద్రి వర్గాలు చెబుతున్నాయి.