CP:తహసీల్దార్ రమణయ్య హత్య కేసు నిందితుడిని గుర్తించాం: సీపీ

  • IndiaGlitz, [Saturday,February 03 2024]

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు నిందితుడిని గుర్తించామని విశాఖ పోలీస్ కమిషనర్‌ రవిశంకర్‌ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు పది ప్రత్యేక బందాలు ఏర్పాటు చేశామన్నారు. నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అనేది దర్యాప్తు చేస్తున్నామి చెప్పారు. ఎయిర్‌వే ద్వారా పారిపోయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. నిందితుడు చాలా సార్లు ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లినట్లు గుర్తించామని.. రియల్ ఎస్టేట్ వివాదాలే హత్యకు కారణమని గుర్తించామన్నారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో హత్య జరిగిందన్నారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్‌కు వెళ్లి దర్యాప్తు చేపట్టారని వివరించారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు.

కాగా విశాఖ రూరల్ చినగదిలి తహసీల్దార్‌గా రమణయ్య పనిచేస్తున్నారు. నగరంలోని చరణ్ క్యాజిల్‌ అపార్ట్‌మెంట్‌లోకి ఓ వ్యక్తి వచ్చాడు. అనంతరం రమణయ్యతో వాగ్వాదానికి దిగాడు. తన వెంటనే తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో తలపై దాడి చేశాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలిపోయాడు. స్థానికులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కుటుంబసభ్యులు హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.

సాక్షాత్తూ ప్రభుత్వ ఉద్యోగిని ప్రశాంతమైన విశాఖ నగరంలో హత్యకు గురికావడంతో ప్రభుత్వంపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలు తీస్తోందని టీడీపీ యువ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) ధ్వజమెత్తారు. ఈ దుర్మార్గపు పాలనను అంత‌మొందిచేందుకు ఉద్యోగులంతా ఆత్మస్థైర్యంతో ఉండాలని కోరారు. అధికారం కోసం సొంత బాబాయ్‌ని హత్య చేసిన జ‌గ‌న్ గ్యాంగ్ త‌మ దోపిడీకి స‌హ‌క‌రించ‌ని ఉద్యోగుల అడ్డు తొల‌గించుకుంటోందని ఆరోపించారు. ఈ ఫ్యాక్షన్ స‌ర్కారు అంతానికి ఇంకా 2 నెల‌లే స‌మ‌యం ఉందని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.

ఇక వైసీపీ పాలనలో విశాఖలో ఎప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు భయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. గతంలో విశాఖ ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం.. ఇప్పుడు తహసీల్దార్ రమణయ్య దారుణ హత్య విశాఖ వాసులను ఉలిక్కిపాటుకు గురిచేసిందన్నారు. ప్రభుత్వం విశాఖను నేర రాజధానిగా తయారు చేస్తోందని విమర్శించారు. విశాఖలో భూ మాఫియా రెచ్చిపోతుందని ఇప్పటికైనా అసాంఘిక వ్యక్తులపై ప్రభుత్వం దృష్టిసారించాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు రమణయ్య హత్యను ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండించింది. రమణయ్య కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని నాయకులు తెలియజేశారు. హత్యకు కారకులను వెంటనే అరెస్ట్‌ చేయాలని అసోసియేషన్‌ నాయకులు బొప్పరాజు, చేబ్రోలు కృష్ణమూర్తి డిమాండ్‌ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు రమణయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. రమణయ్య భార్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.