ప్రణయ్ హత్యకేసులో నిందితులు బెయిల్‌పై విడుదల
- IndiaGlitz, [Sunday,April 28 2019]
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితులు ఆదివారం జైలు నుంచి విడుదలయ్యారు. వాస్తవానికి ఈ నిందితులంతా శనివారమే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ బెయిల్ పత్రాల్లో కొన్ని సాంకేతిక లోపాల వల్ల రిలీజ్‌కు బ్రేక్ పడింది.
ఈ మేరకు ఆదివారం ఉదయం నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం నిందితులు వరంగల్ జైలు నుంచి బయటికొచ్చారు. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితులైన అమృత తండ్రి మారుతీరావు, ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, కరీంకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే.. ఈ ముగ్గురిపై 2018 సెప్టెంబర్ 18వ తేదీన పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు బెయిల్‌పై తిరిగి బయటికొస్తే.. ప్రణయ్ కుటుంబానికి ప్రమాదమని భావించిన పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. నిందితులు మాత్రం రెండు నెలల క్రితమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
నిందితులు బయటికి రావడంతో ప్రణయ్ భార్య, తల్లిదండ్రులు పోలీసులు ఆశ్రయించగా అన్ని విధాలా రక్షణ కల్పిస్తామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో తమకు న్యాయం జరిగేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అమృత మీడియాకు వివరించింది. మరోవైపు పోలీసులు సైతం సుప్రీంను ఆశ్రయిస్తామని చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారం ఎంత వరకూ వెళ్తుందో వేచి చూడాల్సిందే మరి.