HMDA అవినీతి అనకొండ అరెస్ట్.. రూ.100కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు
- IndiaGlitz, [Thursday,January 25 2024]
హైదరాబాద్‌లో భారీ అవినీతి కొండ ఏసీబీ అధికారులకు దొరికింది. ఆ అనకొండ అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు చూసి అధికారులే నివ్వెరపోయారు. హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ పట్టణ ప్రణాళిక విభాగం(HMDA) మాజీ డైరెక్టర్, రేరా కార్యదర్శి శివబాలకృష్ణ అక్రమాస్తుల చిట్టా చూస్తే దిమ్మతిరిగి పోతుంది. సాధారణ ప్రభుత్వ ఉద్యోగి వందల కోట్ల ఆస్తులు సంపాదించడం చూసి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. హెచ్ఎండీఏ పరిధి జోన్లలోని నిబంధనలను ఆసరాగా చేసుకొని వందల దరఖాస్తులకు ఆమోదం తెలిపేందుకు భారీగా వసూళ్లు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బుధవారం తెల్లవారుజామున నుంచి తనిఖీలు చేపట్టారు. శివబాలకృష్ణ ఇళ్లు, బంధువులు ఇళ్లల్లో 14 బృందాల అధికారులు సోదాలు జరిపారు. క్యాష్ కౌంటింగ్ యంత్రాలు పెట్టి మరీ డబ్బులు లెక్కించారు. తనిఖీల్లో భాగంగా వంద కోట్లకు పైగా ఆస్తులు గుర్తించినట్లు చెబుతున్నారు. ఇంకా చాలా ఆస్తులు లెక్కించాల్సి ఉంటుందన్నారు. అలాగే బ్యాంకు లాకర్లు తెరవలేదని.. అవి కూడా తెరిస్తే ఇంకా ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు వెలుగులోకి వస్తాయో చూడాలన్నారు. ఆయన అక్రమ ఆస్తులను చూసి అధికారులే షాక్ తిన్నారు. ప్రస్తుతం ఆయనను అదుపులోకి తీసుకున్న అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.
ఇప్పటి వరకు రూ.40లక్షల నగదు, రూ.5కోట్ల విలువ చేసే కిలోల కొద్దీ బంగారం, 60 ఖరీదైన వాచ్‌లు, 15 విలువైన మొబైల్ ఫోన్లు, 10 ల్యాప్‌టాప్‌లు గుర్తించారు. దీంతో పాటు 70 ఎకరాలు.. స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో రాజకీయ నేతల అండదండలతో పాటు ఉన్నతాధికారుల సహకారంతోనే కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది. రిమాండ్‌లోకి తీసుకుని విచారిస్తే పెద్ద తలకాయల హస్తం కూడా బయటపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.