Janmabhoomi Express: జన్మభూమి రైలు నుంచి తెగిపోయిన బోగీలు.. తప్పిన పెను ప్రమాదం..

  • IndiaGlitz, [Wednesday,May 22 2024]

విశాఖపట్నం నుంచి లింగంపల్లి రావాల్సిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరిన కొద్దిసేపటికే నిలిచిపోయింది. ఫ్లాట్‌ఫాం నుంచి మొదలైన రెండు నిమిషాలకే రైలును హుటాహుటిన నిలిపివేయాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే.. జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయం 6.20కు విశాఖపట్నంలో బయల్దేరింది. అయితే బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్‌ ఊడిపోయింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును మళ్లీ విశాఖ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

సాంకేతిక సమస్యతో 2 బోగీలు రైలు నుంచి విడిపోయాయని అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించాక రైలును పంపిస్తామని చెప్పారు. అయితే దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైలు రన్నింగ్‌లో ఉండగా ఏసీ బోగీలు ఊడి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరమ్మతులు చేసిన అనంతరం జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖ నుంచి బయల్దేరింది. ప్రస్తుతం 3 గంటలు ఆలస్యంగా ఈ రైలు నడుస్తోంది. మొత్తానికి ఫ్లాట్‌ఫాం మీదే బోగీలు ఊడిపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి.

జన్మభూమి రైలు టైమింగ్స్:

12806 నెంబరు గల లింగంపల్లి - విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైలు ప్రతి రోజు ఉదయం 6.15 గంటలకు లింగంపల్లిలో బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 7.40కి విశాఖపట్నం చేరుతుంది.

12805 నెంబరుతో విశాఖపట్నం - లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైలు ప్రతి రోజు ఉదయం 6.20కి విశాఖపట్నంలో బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 7.40కి లింగంపల్లికి చేరుతుంది.

ఈ రైలు విశాఖపట్నం నుంచి దువ్వాడ - అనకాపల్లి - యలమంచిలి - తుని - అన్నవరం - సామర్లకోట - రాజమండ్రి - తాడేపల్లిగూడెం - ఏలూరు - నూజివీడు - విజయవాడ జంక్షన్ - తెనాలి జంక్షన్ - గుంటూరు జంక్షన్ - సత్తెనపల్లి - పిడుగురాళ్ల - నడికుడి - మిర్యాలగూడ - నల్గొండ - రామన్నపేట - సికింద్రాబాద్ జంక్షన్ - బేగంపేట్ - లింగంపల్లికి స్టేషన్లలో ఆగుతుంది.