రేపు ఇండియాకు పైలట్ అభినందన్..

  • IndiaGlitz, [Thursday,February 28 2019]

భారత పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ను పాక్ చెరనుంచి క్షేమంగా తిరిగి రావాలని యావత్ ఇండియా చేసిన ప్రార్థనలు, అధికారుల ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. పాకిస్థాన్‌తో తాము ఎలాంటి ఒప్పందం చేసుకోబోమని, బేషరతుగా వెంటనే అభినందన్‌ను పాక్‌ భారత్‌కు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విదితమే. జెనీవా ఒప్పందాన్ని పాక్ ఉల్లఘిస్తోందంటూ ప్రపంచ దేశాలన్నీ దుమ్మెత్తిపోశాయి. దీంతో తమ ఉనికికే ప్రమాదం వస్తుందని భావించిన పాక్ కీలక నిర్ణయమే తీసుకుంది.

ఈ సందర్భంగా పాక్ ప్రధాని మీడియాతో మాట్లాడుతూ.. పైలట్ అభినందన్‌‌ను రేపు అనగా శుక్రవారం రోజున భారత్‌‌కు అప్పగిస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రధాని అధికారికంగా ప్రకటించారు. నిన్న భారత ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ప్రయత్నించాను కానీ కుదర్లేదని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. అభినందన్ విషయమై పాక్ పార్లమెంట్‌‌లో ఇమ్రాన్ ప్రకటన చేశారు. కాగా.. పాక్ ఆర్మీ మూకలు ఎంత కొట్టినా.. గద్దించి అడిగినా చిత్రహింసలు పెట్టినా చిన్నపాటి సమాచారం కూడా అభి బయటికి పొక్కలేదు. దీంతో ఆయనపై యావత్ ఇండియన్స్ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.