భారత హైకమిషన్‌కు 'అభినందన్' అప్పగింత
- IndiaGlitz, [Friday,March 01 2019]
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ అధికారులు భారత హైకమిషన్‌కు అప్పగించారు. గురువారం మధ్యాహ్నం అభినందన్‌ను ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు అప్పగించడం జరిగింది. ఇవాళ 3 గంటలకు ఆయన అట్టారి-వాఘా జాయింట్ చెక్‌పోస్ట్ మీదుగా ఇండియాలో అడుగుపెట్టనున్నారు. శాంతిని ఆకాంక్షిస్తూ అభినందన్‌ను విడుదల చేస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించిన విషయం విదితమే.
అభినందన్ విడుదలవేళ భారత్‌లో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. వేలాదిమంది భారతీయులు వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌కు ఘనస్వాగతం పలికేందుకు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ముఖ్యంగా అభినందన్ కుటుంబీకులు ఆయన్ను కలిసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అభినందన్ విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది భారతీయుల్లో క్షణ క్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు కోట్లాది మంది యువత ఆయనకు అభిమానులుగా మారిపోయారు. యావత్ ప్రపంచ వ్యాప్తంగా జనాలు అభినందన్ రాకను చూసేందుకు టీవీల ముందు కూర్చున్నారు.
ఇదిలా ఉంటే అభినందన్ విడుదల క్రమంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ‘నోబెల్ శాంతి పురస్కారం’ ఇవ్వాలంటూ పిచ్చి డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం నోబెల్ పీస్ప్రైజ్ ఫర్ ఇమ్రాన్ ఖాన్ (#NobelPeacePrizeForImranKhan) పాక్ ట్విట్టర్లో ట్రెండింగ్‌లో మోత మోగుతోంది.