Abhimanyudu Review
హీరో విశాల్ కెరీర్ ప్రారంభంలో మాస్ ఇమేజ్ కోసం సినిమాలు చేశారు. అయితే మధ్యలో టర్న్ తీసుకుని వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలాంటి చిత్రాల్లో `అభిమన్యుడు` ఒకటి. సాంకేతికత వల్ల ఎంత ఉపయోగముందో అంతే ప్రమాదమూ ఉంది అని చెప్పే చిత్రమే అభిమన్యుడు. ఇరుంబుతిరై అనే పేరుతో తమిళంలో విడుదలైన ఈ సినిమా విడుదలకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కారణం. సినిమా డిజిటల్ ఇండియా, ఆధార్ కార్డ్ వినియోగానికి వ్యతిరేకంగా ఉండటమే కారణమనే వివాదం రావడం. దాంతో సినిమాను ఆపేయమని కూడా బంద్‌లు చేశారు. కానీ సినిమా విడుదలైన తర్వాత సినిమాలో చెప్పిన విషయం పట్ల అందరూ కన్విన్స్ అయ్యారు. ఇంతకు అభిన్యుడులో దర్శకుడు మిత్రన్, హీరో, నిర్మాత విశాల్ ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
తండ్రి అప్పులు చేసి కుటుంబానికి పరువు సమస్య తీసుకుని వస్తుంటాడు. దాంతో పన్నెండేళ్ల వయసులోని ఇల్లు వదలి వచ్చేస్తాడు కరుణాకర్(విశాల్) ఇతనికి ఓ చెల్లెలు కూడా ఉంటుంది. కోపం ఎక్కువగా కూడా వస్తుంటుంది. అదే సమయంలో అన్యాయాలను చూసి తట్టుకోలేక ఇద్దరి, ముగ్గురిని కొడతాడు కూడా. దాంతో సైక్రియాటిస్ట్ దగ్గర చికిత్స చేయించుకోమని ఆర్మీ నుండి దూరం పెడతారు. సైక్రియాటిస్ట్ లతాదేవి(సమంత) వద్దకు వెళ్లిన కరుణాకర్.. కుటుంబంలో నెలపాటు ఆనందంగా గడిపితేనే తాను క్లియరెన్స్ ఇస్తానని లతాదేవి కండీషన్ పెడుతుంది. కండీషన్ మీద ఊరెళ్లిన కరుణాకర్‌కి అన్నగా... తనకు చెల్లెలకు పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉందని తెలుసుకుంటాడు. పెళ్లికి పది లక్షలు డబ్బు అవసరం కావడంతో పొలం అమ్మి నాలుగు లక్షలు బ్యాంకులో వేస్తాడు. అలాగే లోన్ కోసం చాలా బ్యాంకులు తిరిగినా ఎవరూ లోన్ ఇవ్వరు. అదే సమయంలో ఓ ఏజెంట్ మాటలు నమ్మి అబద్దం చెప్పి బ్యాంకు నుండి ఆరు లక్షలు లోన్ తీసుకుంటాడు. అయితే అకౌంట్‌లోని పదిలక్షలను వైట్ డెవిల్(అర్జున్) కాజేస్తాడు. అసలు వైట్ డెవిల్, కరుణాకర్ డబ్బులు ఎందుకు కాజేస్తాడు? అసలు వైట్ డెవిల్ ఎవరు? చివరకు వైట్ డెవిల్‌ను కరుణాకర్ ఎలా పట్టుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే
విశ్లేషణ:
సాంకేతిక అభివృద్ది అవసరమే.. అయితే ఈ అభివృద్ధి కారణంగా మనం ఎటు ప్రయాణిస్తున్నాం. సాధారణ పౌరుడు మోసాలకు గురవుతున్నాడు కదా! అనే విషయాలను విశీదకరంగా అభిమన్యుడు సినిమాలో చెప్పాడు దర్శకుడు మిత్రన్. మనం రోజూ చేసే విషయాల్లో ఎంత డొల్లతనం ఉందో మనకు క్లియర్‌గా చూపించాడు. ఇది చూసిన తర్వాత మన చుట్టూ ఉన్న సాంకేతిక అభివృద్ధిని చూసి భయపడాల్సి వస్తుంది. ఇలాంటి సునిశితమైన విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు దర్శకుడు. బ్యాంకుల్లో ఆర్ధిక మోసాలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాన్ని కులంకుషంగా ఇందులో వివరించారు. ఇక హీరో విశాల్ చేసిన మరో వైవిధ్యమైన చిత్రమిది. విశాల్ ఎప్పటిలా తన నటనతో, ఫైట్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇలాంటి డిఫరెంట్ చిత్రాన్ని ఎంచుకున్నందుకు హీరోగా, నిర్మాతగా విశాల్‌ను అభినందించాల్సిందే. ఇక సమంత పాత్ర ఇందులో చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. పెర్ఫామెన్స్‌కు పెద్దగా స్కోప్ లేని పాత్రలో సమంత నటించింది. ఇక విలన్‌గా నటించిన అర్జున్. వైట్ డెవిల్‌గా మెప్పించాడు. ఆయన నటనతో వైట్ డెవిల్ అనే పాత్రకు ప్రాణం పోశాడు. విశాల్ తండ్రిగా నటించిన ఢిల్లీ గణేశ్ తప్ప.. సినిమాలోనటించిన వారంతా.. తమిళనటీనటులే. జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ బావుంది. రూబెన్స్ ఎడిటింగ్, యువన్ సంగీతం కథను ఆడియెన్‌కు కనెక్ట్ చేయడంలో తమ వంతు ఎఫర్టనిచ్చాయి. రాజేశ్ ఎ.మూర్తి రాసిన సంభాషణలు బావున్నా... ఎఫెక్టివ్‌గా లేవు. ఆక పాటల సాహిత్యంలో లిప్ సింగ్ లేదు. ఇక పాటలు వచ్చిన సిచ్యువేషన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ప్రపంచం టెక్నాలజీ పరంగా వేగంగా వృద్ధి చెందుతుంది. అందులో భాగంగా డిజిటల్ ఇండియా అనే అంశంతో ఇండియా అభివృద్ధి చెందుతుందని రాజకీయ నాయకులు అంటున్నారు. బ్యాంకు, గ్యాస్, మొబైల్ కనెక్షన్ ఇలా అన్నింటికీ మన ఆధార్ కార్డ్ అవసరం అని లింక్ చేయమని అంటున్నారు. టెక్నాలజీ పెరుగుతుంది ఓకే.. కానీ దానికి మరోవైపు దాని వల్ల కలిగే అనర్థాలు కూడా ఉన్నాయి. మన వ్యక్తిగత విషయాలను మనకు తెలియకుండా మన స్మార్ట్‌ఫోన్ ద్వారా పక్కవాడికి మనమే ఇచ్చేస్తున్నాం. ఏదో అప్ డౌన్ లోడ్ చేసే సమయంలో మన ఫోన్‌ను హ్యాక్ చేసి దాని నుండి మనకు తెలియకుండా మన వివరాలను దొంగలించేస్తున్నారు హ్యాకర్లు. ఆధార్ కార్డ్ మన ఐడెంటిటీ ప్రూఫ్ మాత్రమే కాదు.. అందులో మన వేలిముద్రలు, కంటిపాప స్కాన్ వివరాలు సహా ఉంటాయి. అలాంటి బలమైన మన ఆధారం పక్కవాడి చేతికి వెళితే ఏమవుతుంది? అనే అంశాన్ని చెప్పిన చిత్రమే అభిమన్యుడు. ఈ సినిమా చూసిన తర్వాత మన ఫోన్ హ్యాక్ అయ్యిందేమో అనే అనుమానం కలుగక మానదు. చాలా వివరాలు మన ఫోన్ నుండి ఇతరులకు వెళ్లిపోతుంది. మనకు తెలియకుండానే మన ఫోన్ ద్వారానే మన వీడియోలు, ఆడియో రికార్డు తీసుకోవచ్చు. టెక్నాలజీ పెరిగే కొద్ది మనలో జాగ్రత్త కూడా పెరగాలి. ఎవడికి పడితే వాడికి, ఎక్కడ పడితే అక్కడ మన వివరాలను ఇచ్చేయకూడదు. మన సంతకాలు గుడ్డిగా పెట్టయకూడదు అనే విషయం బోధ పడుతుంది
చివరగా.. అభిమన్యుడు.. వేకప్ కాల్.. బీ అలర్ట్
- Read in English