'అభిలాష' కు 35 ఏళ్ళు
Send us your feedback to audioarticles@vaarta.com
నిరపరాధికి ఉరి శిక్ష(సెక్షన్ 302) పడి.. తీరా అతడు మరణించిన తర్వాత నిరపరాధి అని తెలిస్తే ఆ శిక్షకు, ఆ సెక్షన్‌కు విలువేముంది అని ప్రశ్నించిన చిత్రం 'అభిలాష'. యండమూరి వీరేంద్రనాథ్ రచించిన 'అభిలాష' అనే నవలాధారంగా అదే పేరుతో సినిమాని తెరకెక్కించారు దర్శకుడు ఎ. కోదండ రామిరెడ్డి.
చిరంజీవి, రాధిక, రావుగోపాలరావు, గొల్లపూడి మారుతీరావు ప్రధాన తారాగణంగా ఈ సినిమా తెరకెక్కింది. సాధారణ వ్యక్తిగా, అమాయకపు లాయర్ చిరంజీవిపాత్రలో చిరంజీవి ఒదిగిపోయి నటించారు. కొన్ని కీలక సన్నివేశాల్లో బాలీవుడ్ నటుడు రాజ్ కపూర్ నటనను చిరు గుర్తుకుతెస్తారు. ఇక తెరపై చిరంజీవి, రాధిక కెమిస్ట్రీ గురించి వేరేగా చెప్పనక్కరలేదు. ఈ సినిమాలో ఈ జంట ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక సర్వోత్తమరావుగా రావుగోపాలరావు విలనిజాన్ని ప్రేక్షకులు ఎప్పటికి మరచిపోలేరు. శర్మగా రాళ్ళపల్లి నటన కూడా సినిమాకి ప్లస్.
అలాగే "సచ్చిన సవాలు సచ్చినట్టు ఉండకపోతే నానెట్టా సచ్చేది", "అగ్గిపెట్టి ఉందా బామ్మర్ది" అంటూ గొల్లపూడి మారుతీరావు చేసిన సందడి అంతా ఇంతా కాదు.
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరపరచిన పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. 'వేళాపాళా లేదు"(ఆచార్య ఆత్రేయ) మినహా.. మిగిలిన పాటలన్నీ వేటూరి సుందరరామూర్తి కలం నుంచి జాలువారినవే. ముఖ్యంగా "ఉరకలై గోదావరి" వంటి రొమాంటిక్ సాంగ్‌లో కూడా "ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది" అనే లైన్.. కథానాయకుడు జీవితంలో పడే ఆరాటాన్ని తెలియజేస్తుంది.
ఈ చిత్రాన్ని మోహన్ ప్రధాన పాత్రధారిగా 'సట్టత్తై తిరుతుంగల్' పేరుతోతమిళంలో రీ-మేక్ చేశారు. మార్చి 11, 1983న విడుదలైన 'అభిలాష'.. నేటితో 35 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments