ABCD (American Born Confused Desi) Review
'గౌరవం', `కొత్తజంట`, `శ్రీరస్తు శుభమస్తు`, `ఒక్క క్షణం` దేనికి అదే ప్రత్యేకమైన సినిమాలు. వీటన్నిటిలోనూ హీరో అల్లు శిరీష్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌గారి రెండో అబ్బాయిగా చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీ గురించి అవగాహన ఉన్న వ్యక్తి. సినిమా ప్రొడక్షన్ మీదా, సినిమా బిజినెస్ మీద చాలా మంచి నాలెడ్జ్ ఉంటుందని చాలా మంది పొగుడుతుంటారు. తెలుగులో `కొత్త జంట`, `శ్రీరస్తు శుభమస్తు` తర్వాత సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు శిరీష్. ఆయన చేసిన తాజా చిత్రం `ఏబీసీడీ` ఆయన కోరుకున్న హిట్ ఇస్తుందా? అటు అమెరికావాళ్లకు, ఇటు దేశీలకు నచ్చుతుందా? .. లెట్స్ గో త్రూ..
కథ:
తండ్రి(నాగబాబు) మిలియనీర్ కావడంతో అరవింద్(అల్లు శిరీష్)కి డబ్బుంటే విలువ ఉండదు. తండ్రి చెప్పినా అర్థం చేసుకోడు. కొడుకు అరవింద్‌కి డబ్బు విలువ చెప్పాలని తండ్రి నిర్ణయించుకుంటాడు. అందులో భాగంగా అరవింద్‌తో పాటు అతని ప్రాణ స్నేహితుడు బాల షణ్ముగం(భరత్)ని ఇండియా టూర్‌కి వెళ్లమంటాడు. ఇద్దరూ అక్కడకు చేరుకోగానే వారిద్దరినీ ఇండియాలో ఉండిపోయేలా ప్లాన్ చేస్తాడు అరవింద్ తండ్రి. కొడుక్కి, అతని స్నేహితుడికి నెలకు ఐదు వేల రూపాయలు మాత్రమే పంపుతూ ఉంటాడు. మరో పక్క ఓ సీనియర్ మినిష్టర్ (శుభలేఖ సుధాకర్).. అతని కొడుకు భార్గవ్(రాజా)ని తన రాజకీయ వారసుడిని చేయాలనుకుంటాడు. భార్గవ్ మినిస్టర్ కావాలంటే ప్రజల్లో అతనికి పలుకుబడి తప్పని సరిగా ఉండాలని పార్టీ పెద్ద చెప్పడంతో.. భార్గవ్ నియోజక వర్గంలో తిరుగుతూ ఉంటాడు. అయితే ప్రజలకు అందుబాటులో ఉండకుండా వారి ఓట్లని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని చూస్తుంటాడు. ఇండియా వచ్చి రోజుకు 83 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతూ ఉండే అరవింద్.. మినిస్టర్ కావాలనుకునే భార్గవ్‌కి మధ్య యూత్ ఐకాన్ పోటీ జరుగుతుంది. అసలు వారి మధ్యే ఆ పోటీ ఎందుకు జరుగుతుంది? అరవింద్ ఆ పోటీల్లో ఎందుకు పాల్గొంటాడు? చివరకు ఎలా విజయం సాధించాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
అల్లు శిరీష్ తన చిత్రాల కంటే ఏబీసీడీలో నటుడిగా మంచి మార్కులను సంపాదించుకున్నాడు. తన బాడీ లాంగ్వేజ్‌లో ఈజ్ కనపడింది. కామెడి సన్నివేశాల్లో కూడా అల్లు శిరీష్ చక్కగా నటించాడు. హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ లుక్ చాలా క్యూట్‌గా హోమ్లీగా ఉంది. తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. ఉన్న మేర పాత్రకు న్యాయం చేసింది. ఇక ఇప్పటి వరకు బాలనటుడిగా మెప్పించిన భరత్ ఈసారి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో ఆకట్టుకున్నాడు. ఇక వెన్నెల కిషోర్ కూడా కామెడీ ట్రాక్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. నాగబాబు తండ్రి పాత్రలో సునాయసంగా నటించేశాడు. తొలి అర్ధబాగం కామెడీతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక సెకండాఫ్ పాలిటిక్స్‌ను మెయిన్‌గా చూపించే ప్రయత్నం చేశారు. విలన్‌గా రాజా ఆకట్టుకున్నాడు. జుదా సాందీ నేపథ్య సంగీతం బావుంది. పాటల్లో మెల్ల మెల్లగా సాంగ్ బావుంది. ఈ పాట చిత్రీకరణ కూడా ఆకట్టుకుంది. సినిమాలో సెకండాఫ్ విషయంలో కేర్ తీసుకుని ఉండాల్సింది. హీరో, హీరోయిన్ మధ్య కామెడీ ట్రాక్ ఎఫెక్టివ్‌గా లేదు. అలాగే సినిమాలో ఎమోషనల్ పాయింట్స్ ప్రేక్షకులకు కనెక్ట్ కావు. డైలాగ్స్‌లో డెప్త్ లేదు. దర్శకుడు సంజీవ్ రెడ్డి సినిమాపై మరి కాస్త వర్కువుట్ చేసుండాల్సింది. రాజ్‌తోట సినిమాటోగ్రఫీ బావుంది.
చివరగా.. ఏబీసీడీ .... మరింత బలంగా రాయాల్సింది
Read ABCD Movie Review in English
- Read in English