Aaviri Review
కామెడీ, థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబు తనదైన మార్క్‌ను చూపించాడు. అందుకే అల్లరి, నచ్చావులే, అవును, అవును 2, అనసూయ చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. అయితే పందిపిల్లతో రవిబాబు తెరకెక్కించిన `అదుగో` బాక్సాఫీస్ డిజాస్టర్ కావడంతో రవిబాబు మళ్లీ తన ఫేవరేట్ థ్రిల్లర్ జోనర్‌లోనే సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ క్రమంలో రవిబాబు చేసిన చిత్రం `ఆవిరి`. ఈ సినిమాలో తాను ఏం చెప్పదలుచుకున్నాననే విషయాన్ని రవిబాబు ట్రైలర్ ద్వారా చెప్పేశాడు. మరి సినిమాను ఎంత ఆసక్తిగా తెరకెక్కించాడనే సంగతి తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం...
కథ:
రాజ్‌కుమార్(రవిబాబు), లీనా(నేహా చౌహాన్) తమ ఇద్దరు కుమార్తెలు శ్రేయ, మున్నిలతో హ్యాపీగా జీవితం గడుపుతుంటారు. అయితే ఓ ప్రమాదంలో శ్రేయ చనిపోతుంది. అదే ఇంట్లో ఉంటే తమకు శ్రేయ గుర్తుకు వస్తుందని భావించిన రాజ్, లీనా, మున్నితో కలిసి ఓ పాత పెద్ద బంగ్లాలోకి మారిపోతారు. అయితే మున్ని కొత్త ఇంట్లోకి రాగానే ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ప్రవర్తిస్తుంటుంది. ఓ దెయ్యం సాయంతో ఇంటి నుండి పారిపోవడానికి మున్ని ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇంతకు మున్ని ఇంట్లో నుండి ఎందుకు వెళ్లిపోవాలనుకుంటుంది. అసలు మున్నితో ఉండే దెయ్యం ఎవరు? దెయ్యానికి, రాజ్‌కుమార్‌కి ఉన్న రిలేషన్ ఏంటి? రాజ్‌కుమార్, లీనా ఏం చేశారు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
ఓ కుటుంబం ఇంట్లోకి వెళ్లడం.. ఆ ఇంట్లో ఓ దెయ్యం ఉండటం. ఆ కుటుంబంలో ఓ చిన్నపాప దెయ్యం కారణంగా ఎఫెక్ట్ కావడం.. దానికొక కారణముండటం. చివరకు ఆ పాప కోసం కుటుంబ సభ్యులు ఏం చేశారనే పాయింట్‌తో తెరకెక్కిన సినిమాలు ఇది వరకు కోకొల్లలు. అలాంటి పాయింట్‌తోనే తెరకెక్కిన చిత్రం `ఆవిరి`. సాధారణంగా ఇలాంటి కాన్సెప్ట్ చిత్రాలను తెరకెక్కించేటప్పుడు సన్నివేశాలను ఆసక్తికరంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విషయంలో డైరెక్టర్ రవిబాబు పూర్తిగా విఫలమయ్యాడు. సన్నివేశాలను సాగదీసేలా చిత్రీకరించడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటుంది. ఫ్యామిలీ సన్నివేశాలు, థ్రిల్లింగ్ అంశాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. సినిమా పక్కకు వెళ్లిపోతున్న భావనలు చాలా సందర్భాల్లో ప్రేక్షకులకు అర్థమవుతాయి. సన్నివేశాల్లో సహజత్వం లోపించింది. రవిబాబు తన పాత్రకు న్యాయం చేశారు. ఇక ఇద్దరు చిన్న పాపలు నటన పరంగా ఓకే. సినిమాలోని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బావున్నాయి. కథలోని ట్విస్ట్‌ను రివీల్ చేసేటప్పుడు ఫ్లాష్ బ్యాక్ సీన్ బావుంది. ఎన్.సుధాకర్ రెడ్డి కెమెరా వర్క్ బావుంది. వైధి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించదు. ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే.
బోటమ్ లైన్: ఆవిరి.. బోరింగ్ థ్రిల్లర్
Read 'Aaviri' Movie Review in English
- Read in English