Download App

Aatagadharaa Siva Review

'ఆ న‌లుగురు', 'అంద‌రి బంధువ‌య‌' సినిమాలు చూసిన వారికి చంద్రసిద్ధార్థ శైలిని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికీ ఆయ‌న‌కు ` ఆన‌లుగురు` ద‌ర్శ‌కుడిగా ఉన్న గుర్తింపు తెలిసిందే. తాజాగా ఆయ‌న `ఆట‌గ‌ద‌రా శివ‌`ను రూపొందించారు. క‌న్న‌డ‌లో హిట్ అయిన `రామ రామ రామ‌రే` సినిమాకు రీమేక్ ఇది. భారీ సినిమాల నిర్మాత‌గా పేరున్న రాక్‌లైన్ వెంక‌టేశ్ ఈ క‌థ‌, అందులోని భావోద్వేగాలు న‌చ్చి ఈ సినిమాను తెలుగులో తీశారు. క‌న్న‌డ‌లో దాదాపుగా 600 సినిమాలు చేసిన దొడ్డ‌న్న ఈ సినిమా ద్వారా తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుందా? ఇందులోని భావోద్వేగాలు మెప్పిస్తాయా?  లోప‌లికి వెళ్దాం..

క‌థ‌:

జంగ‌య్య (దొడ్డ‌న్న‌) త‌లారి. ప‌శువుల‌కు వైద్యం చేసుకుంటూ ఉంటాడు. అత‌నికి జైల‌ర్ నుంచి గాజుల‌మ‌ర్రి బాబ్జీ(ఉద‌య్ శంక‌ర్‌)ని ఉరి తీయ‌డానికి పిలుపు వ‌స్తుంది. త‌న జీప్‌లో బ‌య‌లుదేరుతాడు. దారిలో అత‌న్ని లిఫ్ట్ అడుగుతాడు బాబ్జీ. అత‌న్ని చూసిన కొద్ది సేప‌టికే ఉరితీయాల్సింది ఇత‌న్నేన‌నీ, జైలు నుంచి త‌ప్పించుకున్నాడ‌ని, అత‌న్ని ప‌ట్టిస్తే రూ.10ల‌క్ష‌లు వ‌స్తాయ‌నీ గ్ర‌హిస్తాడు జంగ‌య్య‌. అయితే ఆ విష‌యాలేవీ తెలియ‌న‌ట్టుగా ఉంటాడు. మ‌ధ్య‌లో అత‌నికి ఆది (హైప‌ర్ ఆది), అత‌ని ప్రేయ‌సి క‌నిపిస్తారు. వీరితో పాటే వాళ్లు కూడా ప్ర‌యాణం చేస్తారు. వాళ్ల‌ను త‌రుముకుంటూ రెండు జీపుల్లో మ‌నుషులు వ‌స్తుంటారు. మ‌ధ్య‌లో ఇద్ద‌రు తాగుబోతులు క‌నిపిస్తారు. ఒకానొక ఊరికి చేరుకునేస‌రికి అక్క‌డ ఏ దిక్కూ లేకుండా పురిటినొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న కోడ‌లు, ఆమె కోసం తాప‌త్ర‌య‌ప‌డే అత్త క‌నిపిస్తారు. వారికి సాయం చేస్తారు. ఇలా సాగిన వారి ప్ర‌యాణం ఎలాంటి మ‌జిలీకి చేరింద‌న్న‌ది ఈ సినిమా క‌థ‌.

ప్ల‌స్ పాయింట్లు:

త‌లారి పాత్ర చేసిన దొడ్డ‌న్న ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్‌. నేచుర‌ల్ గ‌డ్డంతో, భారంగా ఉన్న శ‌రీరంతో, ఒక పెద్దాయ‌న‌లాగా, ఒక‌వైపు మంచీ చెడుల‌ను ఆలోచించే వ్య‌క్తిలాగా, మ‌రోవైపు క‌ర్క‌శ‌మైన త‌లారిలాగా క‌నిపించాడు. హీరో ఉద‌య్‌శంక‌ర్ ర‌గ్డ్ లుక్‌లో తమిళ హీరోలాగా క‌నిపించాడు. పెద్దగా డైలాగులు లేక‌పోయినా ముఖ క‌వ‌ళిక‌ల‌తో బాగానే యాక్ట్ చేశాడు. హైప‌ర్ ఆది జ‌బ‌ర్దస్త్ లో మాట్లాడిన‌ట్టే త‌న స్కిట్స్ అన్నిటినీ ప్ర‌ద‌ర్శించాడు. అత‌ని ల‌వ‌ర్‌గా, వాస్త‌వాల‌ను గ్ర‌హించే మ‌ధ్య త‌ర‌గ‌తి అమ్మాయిగా కొత్త‌మ్మాయి బాగా న‌టించింది. కోడ‌లికి పురుడు అయ్యాక ఆ ఇల్లాలు చెప్పే మాట‌లు, అక్క‌డ‌క్క‌డా తాత్విక‌త‌తో సాగే సంభాష‌ణ‌లు మెప్పిస్తాయి. పాట‌లు వినేకొద్దీ వినాల‌నిపించాయి. నేప‌థ్య సంగీతం కూడా బావుంది. లొకేష‌న్లు, వ్యక్తులు,కాస్ట్యూమ్స్ నేచుర‌ల్‌గా ఉన్నాయి. అక్క‌డ‌క్క‌డా భావోద్వేగాలు పండాయి.

మైన‌స్ పాయింట్లు:

సినిమా మొత్తానికి హైప‌ర్ ఆది మాట‌లు మాత్ర‌మే హుషారుగా వినిపిస్తాయి. మిగిలిందంతా శోకంగా ఉన్నట్టుంటుంది. ఎవ‌రూ ఎవ‌రితో స‌ర‌దాగా మాట్లాడుకోవ‌డాలు ఉండ‌వు. స్క్రీన్ మొత్తం అలా మూగ‌బోయిన‌ట్టు ఉంటుంది. అక్క‌డ‌క్క‌డా ఇద్ద‌రు తాగుబోతులు ఎందుకు వ‌స్తారో, వాళ్ల కంగాళీత‌న‌మేంటో చిరాగ్గా ఉంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ప‌డాల్సింది. ఇప్పుడు తెలుగు సినిమా ఉన్న ఫాస్ట్ కి, ఈ సినిమా ఉన్న స్లోకి ఎక్క‌డా పొంత‌న ఉండ‌దు. యువ‌త‌ను, ఫ్యామిలీస్‌ని టార్గెట్ చేసిన సినిమా కాదేమోన‌నే భావన క‌లుగుతుంది.

విశ్లేష‌ణ‌:

క‌న్న‌డ సినిమాల‌కు మ‌న సినిమాల‌కు ఎప్పుడూ ఓ రెండు, మూడు లేయ‌ర్ల గ్యాప్ ఉంటుంది. అక్క‌డ ఏడాది ఆడిన ముంగార‌మ‌ళైని ఇక్క‌డ వాన‌గా తీస్తే ఫ్లాప్ అయింది. అంత‌ట తేడా ఉంటుంద‌న్న‌మాట‌. విజువ‌ల్ బ్యూటీ, ఎమోష‌న‌ల్ ఫీలింగ్స్ ని ఎంత క్యారీ చేసినా మ‌న వాళ్ల‌కు అవి పెద్ద‌గా న‌చ్చ‌వ‌న్న‌ది నిజం. ఇదే సినిమాను ఇత‌ర భాష‌ల్లో తీస్తే.. భ‌లే ఉంద‌ని, ఈస్త‌టిక్ సెన్స్ ఉన్న సినిమా అని పొగిడే మ‌నం మ‌న ద‌గ్గ‌ర తీస్తే రా, క‌ల్ట్ సినిమా అనే ముద్ర వేసి ప‌క్క‌నపెడ‌తాం. ఈ మ‌ధ్య ఎవ‌రో అన్న‌ట్టు.. 80 శాతం థియేట‌ర్ల‌కు మ‌హారాజ‌పోష‌కులు యువ‌తేన‌ట‌. అలాంటి యువ‌త‌ను శాటిస్‌ఫై చేసే అంశాలు `ఆట‌గ‌ద‌రా శివ‌`లో ఎన్ని ఉన్నాయి? అంటే ఆలోచించాల్సిందే. కాక‌పోతే మంచిని, మ‌న మ‌న‌సును, ఎమోష‌న్స్ ని ఎవ‌రో ఒక‌రు చెప్పాలి. ఎప్పుడో ఒక‌ప్పుడు అయినా గుర్తు చేస్తుండాలి. ప్ర‌తి ఒక్క‌రిలోనూ మ‌న‌సుంటుంది. అది మంచీచెడుల‌ను ఆలోచిస్తుంది. ఈ ర‌కంగా ఆలోచించేవారికి, మ‌రోసారి మ‌న విలువ‌ల‌ను, మ‌న‌సుల‌ను గుర్తుచేసే సినిమా `ఆట‌గ‌ద‌రా శివ‌`. స్లో నెరేష‌న్ లేకుండా ఉంటే మ‌రికాస్త మందికి ఎక్కి ఉండేదేమో. ప్ర‌తిదీ ఈశ్వ‌రేచ్చ అని అంటాడు ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు. మ‌రి ఈ సినిమా జ‌యాప‌జ‌యాలు కూడా అలాంటివే క‌దా... చంద్ర‌సిద్ధార్థ మార్క్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వారికి నచ్చే సినిమా అవుతుంది. ఆ మ‌ధ్య హైప‌ర్ ఆది అన్న‌ట్టు `ఆ న‌లుగురు`ను టీవీల్లో ఇప్ప‌టికీ చాలా మంది చూస్తుంటారు. అలాంటివారు ఈ సినిమాను ఒక‌సారి థియేట‌ర్లో చూసినా సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ చిత్రానికి క్రౌడ్ పుల్ల‌ర్ చంద్ర‌సిద్ధార్థ ఇమేజ్ మాత్ర‌మే.

బాట‌మ్ లైన్‌: ఈ ఆట అంద‌రికీ కాదు క‌ద‌రా.. శివ‌

Aatagadharaa Siva Movie Review in English

Rating : 2.3 / 5.0