పంజాబ్ : పనిచేయని రియల్‌స్టార్ ప్రభావం.. ఓటమిపాలైన సోనూసూద్ సోదరి మాళవిక
- IndiaGlitz, [Thursday,March 10 2022]
పంజాబ్‌లో సామాన్యుడి దెబ్బకు దిగ్గజ పార్టీలు విలవిలాడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. తద్వారా ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మొత్తం 117 స్థానాలకు గానూ.. ఆప్ 90 స్థానాలను గెలుచుకుంది. ఆప్ దెబ్బకు రాష్ట్రంలో పలువురు ప్రముఖులు చిత్తయ్యారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, కెప్టెన్ అమరీందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్ధూ ఓటమిని చవి చూడక తప్పలేదు.
కాగా.. బాలీవుడ్ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక కూడా ఈసారి ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకున్నారు. కాంగ్రెస్ తరపున మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె.. ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ అరోరా చేతిలో పరాజయం పాలయ్యారు. అమన్ దీప్ కు 58,813 ఓట్లు రాగా.. మాళవికకు 38,125 ఓట్లు వచ్చాయి. మోగా నియోజకవర్గం గడిచిన 40 ఏళ్లుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా వుంది. 1977 నుంచి 2017 వరకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆరుసార్లు విజయం సాధించింది. ఇక్కడ మాళవిక తరపున స్వయంగా సోనూసూద్ కూడా పోటీ చేశారు. కానీ ఆయన ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు.
మరోవైపు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడంతో ఆప్ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ సింగ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తన నియోజకవర్గమైన శ్రీమస్తువానా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. విజయం అనంతరం ఆప్ అధినేత కేజ్రీవాల్‌తో కలిసి భగవంత్ మాన్ సింగ్ విక్టరీ సింబల్ చూపిస్తోన్న ఫోటోను ట్వీట్ చేశారు.