ఇండియన్ సినిమాల్లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్న సమయంలో పలు రంగాలకు చెందిన ప్రముఖుల జీవితాలు సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరికొన్ని రూపొందడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆకాశమే నీహద్దురా. దక్కన్ ఎయిర్‌లైన్స్ అధినేత గోపీనాథ్ జీవితంపై రాసిన పుస్తకం సింపుల్ ఫ్లై అనే పుసక్తాన్ని ఆధారంగా చేసుకుని కాస్త కల్పితాన్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ సుధా కొంగర. గురు సినిమాతో సక్సెస్ సాధించిన సుధా కొంగర ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తారు. అసలు చాలా కాలంగా మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న సూర్యకు ఈ సినిమాతో హిట్ దక్కిందా లేదా? అనే విషయాలు తెలుసుకోవడానికి ముందు కథలోకి వెళదాం...
కథ:
చంద్రమహేశ్(సూర్య) చుండూరు గ్రామానికి చెందిన యువకుడు. ఆ ఊరు అభివృద్ధికి చాలా దూరంలో ఉంటుంది. మహేశ్ తండ్రి ఓ స్కూల్ మాస్టర్ ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టి ఊరికి కరెంటుని తెప్పిస్తాడు. అలాగే ఊర్లో రైలుని ఆగేలా చేయాలని చూస్తుంటాడు. కానీ.. రైలు అధికారులు పట్టిచుకోరు. అప్పుడు చంద్రమహేశ్ ఉద్యమం చేస్తాడు. ఫలితంగా ఊర్లో రైలు ఆగుతుంది. మహేశ్‌లోని ఆవేశం కారణంగా తండ్రి నుండి దూరంగా వచ్చేస్తాడు. ఎన్‌డీఏలో ఫైటర్ పైలట్‌గా చేరుతాడు. అక్కడ మహేశ్ టీమ్‌కి బాస్ నాయుడు(మోహన్‌బాబు).. చాలా స్ట్రిట్ ఆఫీసర్. మహేశ్‌పై బెంగతో అతని తండ్రి మరణిస్తాడు. తండ్రిని చివరిచూపు చూడటానికి ఊరికి విమానంలో బయలుదేరాలనుకుంటాడు మహేశ్. ఎకానమీ క్లాసులో టికెట్ డబ్బులతో ఎయిర్‌పోర్టు చేరుకుంటాడు. కానీ అక్కడ బిజినెస్ క్లాసుల టికెట్స్ మాత్రమే ఉంటాయి. దాని వల్ల అతన్ని ఫ్లైట్ ఎక్కనివ్వరు. చివరకు రోడ్డు మార్గంలో వెళ్లే లోపు నాన్నను చివరి చూపు కూడా చూసుకోలేకపోతాడు. దాంతో అప్పటి నుండి మహేశ్ ఉద్యోగానికి రాజీనామా చేసి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ఓ విమానయాన సంస్థను స్టార్ట్ చేయాలనుకుంటాడు. ఈ ప్రయాణంలో చంద్రమహేశ్‌కి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? బేబీతో పెళ్లి ఎలా అవుతుంది? చివరకు చంద్ర మహేశ్ అనుకున్నది సాధించాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
తొలి చిత్రం ఇరుదుసుట్రును తమిళంలో మాధవన్‌తో.. దాన్నే తెలుగులో గురు పేరుతో తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ సాధించింది దర్శకురాలు సుధా కొంగర. తొలి చిత్రం మహిళా బాక్సర్స్ సమస్యలను సినిమా రూపంలో చూపించిన దర్శకురాలు.. రెండో ప్రయత్నాన్ని కూడా అలాగే చేశారు. అందులో భాగంగా ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపీనాథ్ జీవిత ప్రయాణాన్ని తెలియజేస్తూ రాసిన సింప్లీ ఫ్లై ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. ఆయన మొత్తం ప్రయాణంలో ఆరేళ్ల ప్రయాణం అంటే ఎయిర్ డెక్కన్ ప్రారంభించినప్పుడు వచ్చిన సమస్యలు.. సాధించిన విజయాలను మాత్రమే ఈ సినిమాలో దర్శకురాలు చూపించారు.
సినిమాలో ఎమోషనల్ పార్ట్‌కు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది హీరో సూర్య అద్భుతమైన ఎమోషన్స్‌ను క్యారీ చేశాడు. పాత్రను ఆయన క్యారీ చేసిన తీరు చాలా బావుంది. ఎంతలా అంటే మనకు చంద్ర మహేశ్ అనే పాత్ర మాత్రమే గుర్తుకువస్తాడు. ఎక్కడా కమర్షియల్ హీరోయిజం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సినిమాలో రియాలిటీని, నాటకీయతను జత చేస్తూ చాలా చక్కగా సినిమాను రూపొందించారు. రైటింగ్ విభాగానికి ఈ క్రెడిట్‌ను ఇవ్వాలి. సినిమాలో హీరో సక్సెస్ అవుతాడు.. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓ సామాన్యుడు ఖరీదైన విమానయాన సంస్థకు అధినేత కావడం అంటే కలలో కూడా ఊహించలేనిది. అలాంటి విషయాన్ని సాధించడంలో చాలా సమస్యలే ఉంటాయి. మరి ఆ యువకుడు తన అనుకున్న కలను చేరుకునే క్రమాన్ని.. అసలు ఆ ఆలోచన రావడానికి కారణమైన అంశాలను చాలా ఎగ్జయిటింగ్‌గా, ఎమోషనల్‌గా చూపించారు.
హీరో, హీరోయిన్ మధ్య సన్నివేశాలు చక్కగా ఉన్నాయి. ఇద్దరి మధ్య ప్రేమ.. భర్తకు భార్య అందించే సపోర్ట్, కోపతాపాలు, ఆలోచనలను రియాలిటీకి దగ్గరగా చిత్రీకరించారు. ఇక చంద్రమహేశ్‌ను ఎయిర్‌లైన్స్ రంగంలోని రానీయకూడదనుకునే వ్యక్తి పరేశ్‌గా పరేశ్ రావల్ నటన సింప్లీ సూపర్బ్. అలాగే సూర్యను ఇబ్బంది పెడుతూ చివరల్లో సపోర్ట్ చేసే నేవీ ఆఫీసర్ నాయుడు పాత్రలో మోహన్‌బాబు ఒదిగిపోయారు. తనదైన మేనరిజంతో ఆయనా పాత్రను చేసిన విధానం బావుంది. ఇక ఊర్వశి సహా ఇతర పాత్రధారులన్నీ చక్కగా నటించారు. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్‌ను మరింత గ్రిప్పింగ్‌గా, ఎమోషనల్‌గా రూపొందించారు. డైలాగ్స్ ఎక్కడా శృతి మించలేదు. ఎక్కడా ఆవేశంతో రెచ్చిపోయి అరవడాలు, గొడవలు పడటాలుండవు. సందర్భానుసారం వచ్చే కోపాలు, తాపాలు ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతాయి. సినిమాలో పాటలు ఓకే.. నేపథ్య సంగీతం బావుంది. బొమ్మిరెడ్డి నికేత్ సినిమాటోగ్రఫీ బావుంది. ఇక ఓ మహిళా దర్శకురాలిపై నమ్మకంతో నిర్మాతలు సూర్య, గునీత్ ఈ సినిమా చేయడం గొప్ప విషయం. సుధా కొంగర కూడా తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సినిమాను చక్కగా తెరపై ఆవిష్కరించారు.
బోటమ్ లైన్: ఆకాశం నీ హద్దురా... స్ఫూర్తిదాయకం
Comments