అంధుడిగా ఆది పినిశెట్టి?

  • IndiaGlitz, [Sunday,December 17 2017]

11 ఏళ్ల క్రితం విడుద‌లైన ఒక విచిత్రంతో క‌థానాయ‌కుడిగా తొలి అడుగులు వేశాడు ఆది పినిశెట్టి. ఆ చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌య‌త్నాలు చేశాడు. అక్క‌డ ఆదికి మంచి ఆద‌ర‌ణే ల‌భించింది. అంతేకాకుండా..అక్క‌డ స‌క్సెస్ అయిన కొన్ని చిత్రాలు ఇక్క‌డా అనువాద‌మై ఆదికి గుర్తింపు తెచ్చాయి.

వైశాలి, మృగం వంటి అనువాద చిత్రాల్లో ఆది న‌ట‌న‌కి మంచి పేరు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తెలుగులోనూ అత‌నికి అవ‌కాశాలు వ‌చ్చాయి. గుండెల్లో గోదారి రూపంలో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆది.. గ‌త సంవ‌త్స‌రం విడుద‌లైన‌ స‌రైనోడు చిత్రంతో ప్ర‌తినాయ‌కుడిగా అవ‌తార‌మెత్తాడు. ఈ చిత్రంలో న‌ట‌న‌కి గానూ నంది పుర‌స్కారాన్ని సైతం అందుకున్నాడు ఆది.

ప్ర‌స్తుతం అజ్ఞాత‌వాసి, రంగ‌స్థ‌లం చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఆది.. కోన వెంక‌ట్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో హీరోగానూ న‌టిస్తున్నాడు. తాప్సీ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఆది అంధుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని క‌థనాలు వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య‌ అంధ‌గాడు చిత్రంలో రాజ్ త‌రుణ్‌, రాజా ది గ్రేట్ చిత్రంలో ర‌వితేజ అంధుడి పాత్ర‌ల్లో క‌నిపించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆది ఈ జాబితాలో చేరుతున్నాడ‌న్న‌మాట‌.