పక్కింటి అబ్బాయి పాత్రలో ఆది
- IndiaGlitz, [Wednesday,July 05 2017]
భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా నారా రోహిత్, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్, ఆది హీరోలుగా రూపొందిన చిత్రం 'శమంతకమణి'. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాత. ఈ సినిమా జూలై 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో ఆది సినిమా గురించిన విశేషాలను తెలియజేశాడు.
పక్కంటి అబ్బాయిలా....
'''శమంతకమణి' చిత్రంలో కార్తీక్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా కనపడతాను. కార్తీక్‌ది మధ్య తరగతి కుటుంబం. ఓ అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. మన పక్కింటి అబ్బాయిలా కనిపించే పాత్ర. ఇక సినిమా విషయానికి వస్తే 'శమంతక మణి' అనేది ఒక కారు. దాని చుట్టూ జరిగే కథే ఈ సినిమా.
తను ఫిక్స్ అయిపోయాడు...
ఈ సినిమా కథను ముందు విన్నది నారా రోహిత్ వినగానే తను ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఓసారి నాకు ఫోన్ చేసి 'నలుగురు హీరోలుండే సినిమా కథ శమంతక మణి. ఇందులో ఓ క్యారెక్టర్ నువ్వు చేస్తే బావుంటుంది..'నువ్వు ఇంటికొకసారి రా' అన్నాడు. నేను అప్పటికే 'భలే మంచిరోజు' సినిమా చూశాను. నాకు శ్రీరాంఆదిత్య టేకింగ్ బాగా నచ్చింది. నేను వెళ్ళగానే నాకు పూర్తి సినిమాను వివరించాడు. నెరేషన్‌తో పాటు రీరికార్డింగ్, షాట్ డివిజన్ కూడా ప్రిపేర్ చేసుకుని వివరించాడు. నా క్యారెక్టర్ వినగానే నాకు బాగా నచ్చింది. ఎవరి క్యారెక్టర్ వారికి బాగా సూట్ అయ్యింది.
ప్రతి పాత్రకు ముఖ్యత్వం కనపడుతుంది....
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కథ రాసుకున్నప్పుడే ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. స్క్రీన్‌ప్లే చాలా క్లారిటీగా ఉంటుంది. మెయిన్ హీరోలు ఎవరు ఉండరు. అన్ని క్యారెక్టర్స్ కనపడతాయి. రాజేంద్రప్రసాద్, రోహిత్, సుధీర్, సందీప్, నేను ఇలా అందరికీ హై మూమెంట్స్ ఉంటాయి. ఇందులో పాజిటివ్, నెగటివ్ క్యారెక్టర్స్ అని కాకుండా పరిస్థితుల కారణంగా క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేశాయనేది సినిమాలో కనపడుతుంది. దర్శకుడు శ్రీరాం ఆదిత్య ప్రతి షాట్ ఎలా ఉండాలో ముందుగానే రాసుకున్నాడు. సినిమా క్రైమ్ థ్రిల్లర్. సినిమాలో ఒకే ఒక సిచ్యువేషనల్ సాంగ్ ఉంటుంది. నలుగురు హీరోస్ బాగా కలిసి పోయాం. ఓ టీంలా పనిచేశాం.
తదుపరి చిత్రాలు....
విఫోర్ మూవీస్ బ్యానర్‌లో ప్రభాకర్‌గారి దర్శకత్వంలో ఓ డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. చరణ్‌తేజ్ నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నాను'' అన్నారు.