Download App

A1 Express Review

మ‌న దేశ జాతీయ క్రీడ‌.. హాకీ. మ‌న సినిమాల్లో స్పోర్ట్స్‌పై చాలా సినిమాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ జాతీయ క్రీడ హాకీపై వ‌చ్చిన సినిమాలెన్ని అంటే వేళ్ల‌పై లెక్క‌పెట్టొచ్చు. ముఖ్యంగా మ‌న ద‌క్షిణాదిన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు రావ‌డ‌మే క‌ష్టం. మ‌రి హాకీ ఆట‌పై సినిమా చేయ‌డమంటే గొప్ప విష‌య‌మ‌నే చెప్పాలి. త‌మిళంలో హిప్ హాప్ త‌మిళ హీరోగా హాకీ నేప‌థ్యంలో రూపొందిన చిత్రం ‘న‌ప్పే తునై’. రాజ‌కీయాలు, రాజ‌కీయ నాయ‌కులు ఆట‌ల్లో త‌మ ఆధిప‌త్యాన్ని చూపించుకునే క‌మ్రంలో మంచి ప్ర‌తిభావంతులైన ఆట‌గాళ్లకు అవ‌కాశం రావ‌డం లేదు. ఈ కోణాన్ని స్ప‌శిస్తూ వ‌చ్చిన న‌ప్పేతునై చిత్రాన్ని తెలుగులో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ అని రీమేక్ చేశారు. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్న సందీప్ కిష‌న్ హీరోగా ఈ సినిమారూపొందింది. ఇందులో సందీప్‌కిష‌న్ హీరోగా న‌టించ‌డ‌మే కాదు, ఓ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు. హాకీ నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సినిమా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పించిందో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం.

క‌థ‌:

సంజు(సందీప్ కిష‌న్‌) యానాంలోని త‌న మావ‌య్య ఇంటికి వ‌స్తాడు. అక్క‌డ హాకీ ప్లేయ‌ర్ అయిన‌ లావ‌ణ్య‌(లావ‌ణ్య త్రిపాఠి)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె ప్రేమ‌ను కూడా పొందుతాడు. ఓ సంద‌ర్భంలో లావ‌ణ్య‌కు హాకీ ఆట ప‌రంగా సంజు హెల్ప్ చేస్తాడు. అప్పుడే సంజు ఎవ‌రో కాదు.. వైజాగ్ త‌ర‌పున అండ‌ర్ 21 హాకీ టీమ్ ఆట‌గాడ‌ని.. హాకీ టీమ్ కెప్టెన్ సందీప్ నాయుడు అనే నిజం తెలుస్తుంది. అంత‌ర్జాతీయ హాకీ ప్లేయ‌ర్ అయిన సందీప్ నాయుడు వైజాగ్ వ‌దిలి యానాంకు ఎందుకు వ‌స్తాడు? అనేది అంద‌రిలో మెదిలే ప్ర‌శ్న‌. అదే స‌మ‌యంలో యానాంలో ఎంతో పాపుల‌ర్ అయిన చిట్టిబాబు హాకీ గ్రౌండ్‌ను ఆక్ర‌మించుకుని మెడిక‌ల్ ఫ్యాక్ట‌రీ పెట్టాల‌ని కొంద‌రు ప్లాన్ చేస్తారు. వారు యానాం ప్రాంతానికి చెందిన పొలిటీషియ‌న్‌.. స్పోర్ట్స్ మినిష్ట‌ర్ రావు ర‌మేష్‌( రావు ర‌మేష్‌)ను క‌లుస్తారు. చిట్టిబాబు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసే స్పోర్ట్స్ అకాడ‌మీ హ‌కీ ప్లేయ‌ర్స్ నుంచి ప్ర‌తి ఏడాది ముగ్గురు న‌లుగురు నేష‌న‌ల్ టీమ్‌కు ఎన్నిక‌వుతుంటారు. ఎలాగైనా ఆ గ్రౌండ్‌లో ఫ్యాక్ట‌రీ పెట్ట‌డానికి నిర్ణ‌యించుకున్న మినిష్ట‌ర్, త‌న ప్లానింగ్‌లో భాగంగా ఆ ఏడాది ఏ హాకీ ప్లేయ‌ర్‌ను ఎన్నిక చేయ‌కుండా, చిట్టిబాబు స్పోర్ట్స్ అకాడ‌మీని అండ‌ర్ ఫెర్పామెన్స్‌గా ప్ర‌క‌టిస్తారు. అలా చేస్తే మెడిక‌ల్ ఫ్యాక్ట‌రీకి గ్రౌండ్‌ను లీజుకు ఇచ్చి.. త‌ర్వాత ఫ్యాక్ట‌రీ క‌ట్టొచ్చు అనేది మినిష్ట‌ర్ ప్లాన్‌. అయితే చిట్టిబాబు స్పోర్ట్స్ అకాడ‌మీ కోచ్(ముర‌ళీశ‌ర్మ‌) త‌న టీమ్ అండ‌ర్ ఫెర్ఫామెన్స్ కాద‌ని నిరూపించుకోవాలంటే జాతీయ స్థాయిలో జ‌రిగే ధ్యాన్ చంద్ హాకీ టోర్న‌మెంట్‌లో పాల్గొనాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. త‌న ఇల్లు అమ్మి అకాడ‌మీకి క్ల‌బ్‌గా గుర్తింపు తీసుకొస్తాడు. అయితే టోర్న‌మెంట్‌లో పాల్గొనాలంటే టీమ్‌లో క‌నీసం ఒక‌రైనా నేష‌న‌ల్ ప్లేయ‌ర్ ఉండాల‌నే రూల్ ఉంటుంది. దాంతో కోచ్‌, సందీప్ నాయుడుని అడుగుతాడు. ముందు తాను టోర్న‌మెంట్‌లో ఆడ‌లేన‌ని చెప్పిన సందీప్ మ‌ళ్లీ ఎందుకు చిట్టిబాబు క్ల‌బ్ త‌ర‌పున హాకీ ఆడుతాడు?  అస‌లు సందీప్ నాయుడు అజ్ఞాతానికి కార‌ణం ఎవ‌రు? అనే వివ‌రాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...

విశ్లేష‌ణ‌:

తెలుగు సినిమా ట్రెండ్ మారింది. ఇక్క‌డ ద‌ర్శ‌క నిర్మాత‌లు కొత్త క‌థ‌ల‌ను తెర‌కెక్కించ‌డానికి ఆస‌క్తి చూపుతున్నారు. లేదా ఇత‌ర భాష‌ల్లో డిఫ‌రెంట్‌గా రూపొందిన సినిమాల‌ను ఇక్క‌డ రీమేక్ చేస్తున్నారు. మ‌న టాలీవుడ్ స్టార్స్ సైతం అలాంటి డిఫ‌రెంట్ పాత్ర‌ల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నారు. ఆ క‌మ్రంలో త‌మిళంలో రూపొందిన ‘న‌ప్పే తునై’ చిత్రాన్ని తెలుగులో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’గా రీమేక్ చేశారు. రొటీన్‌కు భిన్న‌మైన సినిమా, అది కూడా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీని తెర‌కెక్కించ‌డానికి సిద్ధ‌మైన నిర్మాత‌ల‌ను, అందులో న‌టించడానికి ముందుకు వ‌చ్చిన హీరో సందీప్ కిష‌న్‌ను అభినందించాలి.

సందీప్‌కిష‌న్.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమాకు క‌ష్ట‌ప‌డ‌నంత‌గా ఈ సినిమాకు క‌ష్ట‌ప‌డ్డాడు. సినిమాలో 21 ఏళ్ల యువ‌కుడిగా క‌న‌ప‌డాలి, అలాగే దానికి పైబ‌డ్డ వ‌య‌సున్న యువ‌కుడిగా క‌న‌ప‌డాలని లుక్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త ప‌డ్డాడు సందీప్‌. హాకీ ప్లేయ‌ర్‌గా క‌న‌ప‌డ‌టానికి మ‌రింత క‌ష్ట‌ప‌డ్డాడు. పాత్ర‌లో ఒదిగిపోవ‌డానికి సిక్స్ ప్యాక్ పెంచి స‌రికొత్త‌గా క‌నిపించే ప్ర‌య‌త్నం చేశాడు. సినిమాలో సందీప్‌ను చూస్తే.. నిజ‌మైన హాకీ ప్లేయ‌ర్ అనిపించేంత‌గా ఇమిడిపోయాడు. ఇక హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి, ఇది వ‌ర‌కు క‌నిపించిన సినిమాల కంటే అందంగా కనిపించింది. లిప్‌లాక్ ఇచ్చి కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెట్టింది. అలాగే హాకీ ప్లేయ‌ర్‌గా ఆమె క‌నిపించ‌డానికి హాకీ నేర్చుకుని ప‌డ్డ క‌ష్టం తెర‌పై క‌న‌ప‌డింది. ఫ‌స్టాఫ్ అంతా సందీప్‌తో క‌లిసి సినిమాను న‌డిపించ‌డంలో లావ‌ణ్య కీల‌క పాత్ర‌ను పోషించింది.

ఇక సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించింది రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి. సాధార‌ణంగా వీరిద్ద‌రూ ఉంటే ఆ పాత్ర‌ల్లో కామెడీ ఎక్కువ‌గా ఉంటుంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు వీరిద్ద‌రూ చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా ఎమోష‌న‌ల్ పాత్ర‌ల్లో న‌టించారు. సెకండాఫ్‌లో క‌థ‌ను ట‌ర్న్ తిప్ప‌డంలో, హీరో పాత్ర‌ను క్లైమాక్స్‌లో మోటివేట్ చేసేలా వీరి పాత్ర‌ల‌ను ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా డిజైన్ చేశాడు. ఇక మినిష్ట‌ర్ పాత్ర‌లో న‌టించిన రావు ర‌మేష్‌.. త‌న‌దైన స్టైల్లో వెట‌కారం క‌ల‌గ‌లిపిన రాజ‌కీయ నాయ‌కుడి పాత్ర‌లో మెరిశాడు. కులాలు, ప్రాంతాలు, మ‌తాల‌ను అడ్డం పెట్టుకుని గొడ‌వ‌ల‌ను క్రియేట్ చేస్తున్న నేటి త‌రం రాజ‌కీయాల‌ను, రాజ‌కీయ నాయ‌కులకు ప్ర‌తినిధిగా రావు ర‌మేష్ పాత్ర మెప్పిస్తుంది. ఇక ముర‌ళీశ‌ర్మ‌, ర‌ఘుబాబు, ఖ‌య్యుమ్‌, స‌త్య‌, పోసాని, మ‌హేశ్ విట్టా త‌దిత‌రులు వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.

ద‌ర్శ‌కుడు డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను సినిమాను త‌మిళ చిత్రం స్టైల్లోనే డిట్టోగా తెర‌కెక్కించ‌లేదు. తెలుగు నెటివిటీకి త‌గిన‌ట్లు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయ‌డం ప్ల‌స్‌గా మారింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో స‌న్నివేశాల‌ను, ఎమోష‌న‌ల్ సీన్స్‌ను తెర‌కెక్కించ‌డంలో దర్శ‌కుడు డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ప‌నిత‌నం క‌నిపిస్తుంది. సంద‌ర్భానుసారం వ‌చ్చే సంభాష‌ణ‌లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. ముఖ్యంగా సెకండాఫ్ ఎమోష‌న‌ల్‌గా ఆక‌ట్టుకుంటుంది. హిప్ హాప్ త‌మిళంలో ఉప‌యోగించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌నే కీల‌క స‌న్నివేశాల‌కు, రెండు, మూడు పాట‌ల‌కు ఉప‌యోగించుకున్నారు. కెవిన్‌రాజ్ సినిమాటోగ్రఫీ బావుంది. విజువ‌ల్స్ చాలా క్లారిటీగా రిచ్‌గా అనిపిస్తాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. ఫ‌స్టాఫ్ ల‌వ్‌స్టోరి ఇత‌ర అంశాల‌తో స్లోగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో నేష‌న‌ల్ ప్లేయ‌ర్స్‌ను లోక‌ల్‌ప్లేయ‌ర్స్ సుల‌భంగా ఓడించ‌డం రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే హాకీ మీద సినిమాను చేసిన మ‌న తెలుగు నిర్మాత‌ల‌ను అభినందించాలి.

బోట‌మ్ లైన్‌: 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'... ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా

Read 'A1 Express' Review in English

Rating : 3.0 / 5.0