భూమిని కొన్న ఏడాది తర్వాత.. ధరణి పోర్టల్ చూసి నల్గొండ జిల్లా వాసి షాక్..
- IndiaGlitz, [Saturday,November 07 2020]
వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాల నమోదు ప్రక్రియ కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియపై కోర్టు స్టే విధించింది. ప్రస్తుతం వ్యవసాయ భూముల నమోదు కార్యక్రమం జరుగుతోంది. కాగా.. నల్లగొండ జిల్లాకు చెందిన ఒక మహిళ ధరణి పోర్టల్‌ను మిస్ యూజ్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని పెద్ద అడిశర్లపల్లికి చెందిన విజయలక్ష్మి అనే మహిళ తన భూమిని అమ్మిన ఏడాది తర్వాత అదే భూమిని తన కుమార్తెల పేరిట ట్రాన్స్‌ఫర్ చేయడం కలకలం రేపింది.
నల్గొండ ఎస్పీ రంగనాథ్.. విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. విజయలక్ష్మి తన భూమిలోని ఒక ఎకరం 32 కుంటల స్థలాన్ని 2019 ఆగస్టులో కోట్ల జగదీష్ అనే వ్యక్తికి అమ్మింది. అతను దానిని ప్లాట్లు చేసి తిరిగి అమ్మేశాడు. తాజాగా జగదీష్ ధరణి పోర్టల్‌లో ఆ ల్యాండ్ మొత్తం విజయలక్ష్మి కుమార్తె ప్రియాంక పేరుపై నమోదైన విషయాన్ని గుర్తించి షాక్‌కు గురయ్యాడు. ధరణి పోర్టల్ ద్వారా విజయలక్ష్మి ఆ స్థలాన్ని తన కూతురి పేరుపై రిజిస్టర్ చేసి తద్వారా అఫీషియల్ డాక్యుమెంట్లను తిరిగి పొందింది.
వెంటనే జగదీష్.. తహసీల్దార్ దేవదాస్‌ను కలవడంతో ఆ ల్యాండ్ ఇంకా విజయలక్ష్మి పేరుపైనే ఉందని తెలిపారు. జగదీష్‌కి ఆ భూమిని అమ్మిన అనంతరం అతని పేరుపై మ్యుటేషన్ ఏమీ ల్యాండ్ రికార్డుల్లో జరగలేదని వెల్లడించారు. విషయం కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, రంగనాథ్ దృష్టికి వెళ్లడంతో ఇక మీదట ఇలాంటి మోసపూరిత చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అనంతరం విజయలక్ష్మిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.