కరోనాని మించిన మహమ్మారి ముందుంది...
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని స్తంభింపజేసింది. సామాన్య ప్రజలు ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుక్కొన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరి కుటుంబాల్లో కనీవినీ ఎరుగని విషాదాన్ని నింపింది. కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే కుటుంబ సభ్యులే చూడటానికి భయపడిపోయారు. చనిపోతే సరేసరి. కనీసం డెడ్‌బాడీని చూసే దిక్కు కూడా లేదు. పాడి పట్టే నలుగురూ లేరు.. అంతిమ యాత్రా లేదు.. వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా ఏడ్చినా చిన్న ఓదార్పూ లేదు. ఇది రూపాయికి ఒక కోణం మాత్రమే.
మరోవైపు చూస్తే.. కరోనా రాని కుటుంబాల పరిస్థితి ఏమైనా బాగుందా? అంటే అదీ లేదు. ఉన్నత కుటుంబాల గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ.. సామాన్యుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. తినడానికి తిండి లేక.. చేసేందుకు పని లేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఒక్క నెల జీతం రాకపోతేనే విలవిల్లాడిపోయే కుటుంబాలు.. కొన్ని నెలల పాటు జీతం రాక.. జీవితాన్ని ఎలా నెట్టుకురావాలో తెలియక.. బలవన్మరణాన్ని ఆశ్రయించిన కుటుంబాలెన్నో.. నేటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. యథావిధిగా కొన్ని సంస్థలు నడిచినప్పటికీ మహమ్మారి పేరు చెప్పి కోట్లు కూడబెట్టుకున్నాయి. తమ వద్ద పనిచేసే సిబ్బందికి పేండమిక్ పేరు చెప్పి నిర్దాక్షిణ్యంగా జీతాలు కోసేశాయి. అదేమంటే వేళ్లను గవర్నమెంట్ వైపు చూపి.. ప్రభుత్వమే కోతలు కోస్తుంటే మేమెంత అని బీద పలుకులు పలికాయి. శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకపోగా.. చెమట చుక్కలను రూపాయలుగా మార్చుకున్న సంస్థలే చాలా ఎక్కువ.
ఇదంతా పక్కనబెడితే.. ఇకముందు పరిస్థితి ఏంటి? కరోనా మహమ్మారి కంటే అతి పెద్ద మహమ్మారిని ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా ఆలోచించాల్సింది సామాన్యుడి గురించే.. మహమ్మారి పేరు చెప్పి రేట్లు ఎంతలా పెరుగుతాయో తెలియదు. దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన రైల్వేనే.. నష్టాల ఊబిలో చిక్కుకుపోయింది. ఆర్టీసీ పరిస్థితి అగమ్యగోచరమే.. పెట్రోల్ రేట్లు ఇప్పటికే సామాన్యులకు అందకుండా పోయాయి. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చినా.. ప్రైవేటు సంస్థలు మాత్రం కరోనా జపాన్నే చేస్తున్నాయి. కోతలకు ఎప్పుడు బ్రేక్ వేస్తాయో తెలియని పరిస్థితి.
పనులు దొరికినా ఆశించిన వేతనమైతే లభించదు. మరి వీటికి తగ్గట్టు రేట్లు ఉంటాయా? అంటే.. అదీ ఉండదు. ప్రతి ఒక్క నిత్యావసరం రేట్లతో పాటు... ఆర్టీసీ, రైల్వే ప్రయాణ సాధనాల రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఏది కొనాలన్నా ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించకపోవచ్చు. ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించి సామాన్యుడు జీవితాన్ని నెట్టుకు రాగలగడమనేది అతి పెద్ద టాస్క్. అటు తిరిగి.. ఇటు తిరిగి సామాన్యుడిపైనే పెనుభారం పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పుడే లాక్ డౌన్ సడలింపులతో కోలుకుంటున్న సామాన్యుడిపై భారం పడకుండా చూసుకోవాల్సిన అవసరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout