దేశ ప్రధానికి వ్యతిరేకంగా కోర్టులో దావా.. రూ.900 కోట్లు డిమాండ్..

  • IndiaGlitz, [Thursday,December 24 2020]

దేశ ప్రధానికి ఝలక్ ఇచ్చిన ప్రజానీకాన్ని ఎక్కడైనా చూశారా? ఎన్నికల్లో అయితే ఓకే కానీ.. దేశ ప్రధానికి వ్యతిరేకంగా ప్రజలే కోర్టు మెట్లక్కడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. అంతేకాదు.. రూ.900 కోట్లు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు 500 మంది ప్రజలు ప్రధాని కారణంగా తమకు తీరని నష్టం వాటిల్లిందని.. కాబట్టి తమకు పెద్ద మొత్తంలో పరిహారం ఇప్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. మరి ప్రధాని కారణంగా అంత బాధ వారికేం వచ్చింది అంటారా?

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఎందరో నిరాశ్రయులయ్యారు. ఈ మహమ్మారి బారిన పడి లక్షల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే తమ సొంతవాళ్లను ఈ కరోనా మహమ్మారి కారణంగా పోగొట్టుకున్న ప్రజలు ఇటలీ ప్రధాని గిసెప్పె కొంటే సహా ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి రోబర్టో స్పెరాంజా, లాంబార్డీ ప్రాంత గవర్నర్ అట్టిలియో ఫొంటావా కోర్టులో దావా వేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో వీరంతా విఫలమయ్యారని దావాలో ఆరోపించారు.

వీరి నిర్లక్ష్యం కారణంగా తమ వాళ్లను కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయానికి దేశ ప్రధాని, ఆరోగ్యశాఖ మంత్రితోపాటు గవర్నర్ కూడా బాధ్యత వహించి.. నష్టపరిహారంగా 100 మిలియన్ యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ. 900కోట్లు) చెల్లించాలని డిమాండ్ చేశారు. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా.. ఇటలీలో కరోనా కారణంగా ఇప్పటి వరకూ 70వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఐరోపా పరంగా కొవిడ్ మరణాల్లో ఇటలీ ప్రథమ స్థానంలో ఉంది.