తెలంగాణలో ఉపఎన్నిక సమీపిస్తున్న తరుణంలో బీజేపీకి భారీ షాక్..
- IndiaGlitz, [Sunday,November 01 2020]
తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించి తన సత్తా చాటేందుకు సిద్దమవుతోంది. ఈ సమయంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరిపోయారు. తాజాగా బీజేపీ తెలంగాణ కీలక నేత రావుల శ్రీధర్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. విషయం తెలుసుకున్న రావుల అనుచరులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున రావుల ఇంటికి చేరుకుంటున్నారు. అయితే రావుల టీఆర్ఎస్‌లో చేరుతారని సమాచారం.
హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా శ్రీధర్ రెడ్డి 2018 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే శ్రీధర్‌రెడ్డి నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయినప్పటికీ శ్రీధర్‌రెడ్డి నియోజకవర్గంలోని పార్టీ కార్యకలాపాల్లో చాలా చురుకుగా పాల్గొనే వారు. అయితే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీధర్‌రెడ్డి పెద్దగా ప్రాధాన్యమివ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏర్పాటైన రాష్ట్ర బీజేపీ కమిటీలో కూడా శ్రీధర్‌రెడ్డి ఎలాంటి పదవి లభించలేదు. దీంతో ఆయన మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది.
మీడియా చర్చా వేదికల్లో శ్రీధర్‌రెడ్డి పాల్గొని బీజేపీ తరుఫున గొంతుకను బలంగా వినిపిస్తుండేవారు. నిన్న మొన్నటి వరకూ దుబ్బాక ఉప ఎన్నికపై శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు. ఇటు ప్రెస్ మీట్‌లలోనూ అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడేవారు. అలాంటి వ్యక్తి పార్టీకి రాజీనామా చేయనుండటంపై రాష్ట్ర బీజేపీ నేతలు షాక్ అవుతున్నారు. కాగా.. భవిష్యత్ కార్యాచరణపై శ్రీధర్ రెడ్డి ఏం ప్రకటన చేయనున్నారోనని అనుచరులు, కార్యకర్తలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.