Kavitha:కవితకు భారీ షాక్.. వారం రోజుల రిమాండ్ విధించిన కోర్టు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి రౌస్ ఎవెన్యూ కోర్టు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విచారణలో భాగంగా 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరగా వారం రోజులు మాత్రమే న్యాయమూర్తి ఇచ్చారు. తిరిగి మార్చి 23 మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు. దీంతో ఏడు రోజుల పాటు ఈడీ హెడ్ క్వార్టర్స్‌లోనే కవిత విచారణ జరగనుంది. కస్టడీ సమయంలో కవితకు ఇంటి నుంచి బట్టలు, భోజనం అందించేందుకు.. కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదులు కలిసేందుకు కూడా అనుమతించింది.
కాగా లిక్కర్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించన సంగతి తెలిసిందే. నాలుగు గంటల పాటు సోదాల అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని రాత్రికి రాత్రే ఢిల్లీకి తరలించిచారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షల తర్వాత రౌస్ ఎవెన్యూ సెషన్స్ కోర్టులో హాజరుపర్చారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి.. ఈడీ తరఫున ఎన్.కె మట్టా, జోయబ్ హుసేన్ వాదించారు.
ముందుగా కవిత తరపున న్యాయవాది వాదిస్తూ అధికార దుర్వినియోగంతో కవితను ఈడీ అరెస్ట్ చేసిందని ఆరోపించారు. సెప్టెంబర్ 15న సుప్రీంకోర్టులో ఇచ్చిన మాట ఉల్లంఘించారని.. మహిళను ఈడీ కోర్టుకు పిలవడంపై కేసు పెండింగ్‌లో ఉంది గుర్తు చేశారు. తదుపరి విచారణ జరిగే వరకు ఎలాంటి చర్యలు తీసుకోమని.. ఓపెన్ కోర్టులో ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు ఈడీ కట్టుబడి లేదన్నారు. మార్చి 15న జరిగిన సుప్రీంకోర్టు విచారణలో ఈడీ తరపున ఏఎస్పీ రాజు సెప్టెంబర్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్ విత్ డ్రా చేసుకుంటున్నామని చెప్పారన్నారు. అనంతరం ఈ కేసును 19కి వాయిదా వేశారని తెలిపారు. అయినప్పటికీ ఈడీ అధికారులు హైదరాబాదులో కవిత ఇంటికి సోదాల పేరుతో వెళ్లి అరెస్ట్ చేశారని.. ఇది అక్రమ అరెస్ట్ అని వాదనలు వినిపించారు.
ఇక ఈడీ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ కవితను చట్టబద్దంగానే అరెస్ట్ చేశామని తెలిపారు. ఇండో స్పిరిట్ ద్వారా కవిత లిక్కర్ స్కాం చేశారని.. బుచ్చి బాబు, మాగుంట మధ్య వాట్సాప్ చాట్‌లో కవిత పాత్ర బయట పడిందన్నారు. "మేడంకు 33 శాతం" అని చాట్‌లో ఉందని పేర్కొన్నారు. ఆ చాట్‌లో ఉన్న మేడం కవితే అని మాగుంట రాఘవ, బుచ్చిబాబును విచారిస్తే అంగీకరించారని కోర్టుకు విన్నవించారు. నేరం చేసి అక్రమ సొమ్ము సంపాదించారని దర్యాప్తులో తేలిందన్నారు. సోదాల సమయంలో కవిత సోదరుడినని చెప్పి 20 మంది లోపలికి వచ్చి గందరగోళం సృష్టించారని వాదించారు. సెక్షన్ 19 ప్రకారమే తాము ముందుకి వెళ్లామన్నారు. ఇది ఎలాంటి కోర్టు ధిక్కారం కాదన్నారు. కఠిన చర్యలు తీసుకోబోమని తాము ఎలాంటి అండర్ టేకింగ్ ఇవ్వలేదని.. పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి నిర్ణయానికి రావద్దని చెప్పకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం వారం రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com