Akbaruddin Owaisi: పోలీసులను బెదిరించడంతో అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు
- IndiaGlitz, [Wednesday,November 22 2023]
తెలంగాణ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో నేతలు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పోలీసులపై నోరు పారేసుకున్నారు. దీంతో పలు సెక్షన్ల కింద ఆయనపై సంతోష్ నగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజు తెలిపారు.
అక్బరుద్దీన్ ఓవైసీ మంగళవారం రాత్రి లలితాబాగ్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే సమయం అయిపోయిందని ప్రచారం ముగించాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న సంతోష్‌నగర్ సీఐ శివచంద్ర కోరారు. దీంతో సదరు పోలీసు అధికారిపై అక్బరుద్దీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వద్ద కూడా వాచీ ఉందని ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందని.. తనను ఆపే వ్యక్తి ఇంకా పుట్టలేదని మండిపడ్డారు. అవసరమైతే తాను ఇంకా మాట్లాడతానని ఎలా అడ్డుకుంటారో చూస్తానని సవాల్ విసిరారు. తాను కనుసైగ చేస్తే చాంద్రాయణగుట్ట నుంచి పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు అయినంత మాత్రాన తన పని అయిపోలేదని, తనలో అదే దమ్ము ఉందని వార్నింగ్ ఇచ్చారు. దీంతో డ్యూటీలో ఉన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేశారు.
మరోవైపు పోలీసులపై అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమర్థించారు. రాత్రి 10గంటలకు ఒక్క నిమిషం దాటితే అప్పుడు ప్రసంగం ఆపే హక్కు పోలీసులకు ఉంటుంది.. కానీ ఐదు నిమిషాల ముందు ప్రసంగం ఆపమని ఏ చట్టం చెప్పిందని ప్రశ్నించారు. సమయం ఇంకా ఐదు నిమిషాలు ఉన్నా పోడియం పైకి పోలీసులు రావడం ఏంటి.. ప్రసంగం ముగించడానికి చివరి ఐదు నిమిషాలు చాలా ముఖ్యమని అసదుద్దీన్ తన తమ్ముడికి మద్దతు తెలిపారు.