Golden Globe Awards: అసలేంటీ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఎప్పుడు పుట్టింది, ఎవరు, ఎందుకిస్తారు..?
- IndiaGlitz, [Thursday,January 12 2023]
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కడంతో టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ సినిమా సంబరాల్లో మునిగిపోయింది. ఇప్పటికే వివిధ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఇదిలావుండగా.. ఆర్ఆర్ఆర్, నాటు నాటు సాంగ్స్‌తో పాటు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్ కూడా నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సైమా, ఫిల్మ్ ఫేర్, నంది అవార్డ్స్, జాతీయ చలనచిత్ర అవార్డ్స్, ఆస్కార్స్ గురించి మనోళ్లకు బాగానే తెలుసు. అయితే ఈ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ అంటే ఏంటి చెప్మా అంటూ నెటిజన్లు ఇంటర్నెట్‌ను జల్లెడ పట్టారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ , ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖులు కూడా ఆర్ఆర్ఆర్ టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారంటే ఏదో ప్రత్యేకమైనదే అనే అనుమానాలు అందరికీ వచ్చాయి.
1944 నుంచి గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు:
కళా రంగంలో విశిష్ట సేవలు అందించిన వారిని సత్కరించాలనే ఉద్దేశంతో హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (హెచ్ఎఫ్‌పీఏ) గోల్డెన్ గ్లోబ్ అవార్డులను ప్రారంభించింది. 1944 నుంచి ఈ అవార్డును ఇస్తున్నారు. ప్రతి ఏటా జనవరి మాసంలో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నగరంలో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతూ వస్తోంది. హాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన చిత్రాలకు కూడా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ను ఇస్తున్నారు. హెచ్‌ఎఫ్‌పీఏలో ప్రస్తుతం 55 దేశాలకు చెందిన 105 మంది సభ్యులు వున్నారు.
సినిమా, టీవీ, యానిమేషన్ సహా 25 కేటగిరీల్లో అవార్డ్స్:
మొదట్లో కొన్ని విభాగాల్లోనే అవార్డులు అందించిన నిర్వాహకులు.. 1950లలో వినోద పరిశ్రమకు సంబంధించిన వారి కోసం ‘‘ఇంటర్నేషనల్ ఫిగర్’’ పేరుతో అవార్డును తీసుకొచ్చింది. దీనిని తొలిసారిగా సెసిల్ బ్లౌంట్ డిమల్లేకు బహూకరించారు. 1956 నుంచి టెలివిజన్‌లో బెస్ట్ సిరీస్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ వంటి విభాగాలు తీసుకొచ్చారు. 2007లో బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ విభాగాన్ని కూడా ప్రారంభించారు. ప్రస్తుతం 25 విభాగాల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డులను అందజేస్తున్నారు. ఈ ట్రోఫీ బరువు 7.8 పౌండ్లు (3.5 కేజీలు), ఎత్తు 11.5 అంగుళాలు.
తొలి భారతీయుడిగా ఏఆర్ రెహమాన్ :
ఇక భారత్ నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైన తొలి చిత్రం ‘‘దో ఆంఖే బారా హాత్’’ . దీనికి శామ్యూల్ గోల్డ్‌విన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్ వరించింది. తర్వాత 1983లో వచ్చిన గాంధీ చిత్రం ఐదు విభాగాల్లో నామినేట్ అయి.. అన్నింట్లోనూ అవార్డులు దక్కించుకుంది. అనంతరం అపుర్ సన్‌స్కార్ (1961), సలామ్ బాంబే (1989), మాన్‌సూన్ వెడ్డింగ్ (2001) సినిమాలు గోల్డెన్ గ్లోబ్‌కు నామినేట్ అయ్యాయి. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడిగా మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ నిలిచారు. 2009లో వచ్చిన స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఆయన ‘‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’’ విభాగంలో గోల్డెన్ గ్లోబ్‌ను ముద్దాడారు. తాజాగా కీరవాణి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. టాలీవుడ్ నుంచి తొలి గోల్డెన్ గ్లోబ్ అందుకున్న వ్యక్తిగా కీరవాణి నిలిచారు.