సీఎం చంద్రబాబుకే కోలుకోలేని షాకిచ్చారు!!
- IndiaGlitz, [Monday,May 06 2019]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా అనుభవాలు చవిచూడాల్సి వస్తోంది. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్ష సమావేశానికి వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, పర్యాటక అధికారులు ఎవరూ రాకపోవడంతో రెండ్రోజులు నిరీక్షించి అవమానంతో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో 'ఫొనీ' తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున రైతులు నష్టపోవడంతో రివ్యూకు సోమిరెడ్డికి ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అదే రీతిలో చంద్రబాబుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
అసంతృప్తికి లోనైన బాబు..
ఈ సందర్భంగా 'ఫొనీ' తుఫాన్ విషయమై అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. అదే జోష్తో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా.. ఏపీ ఆయుపట్టు అయిన పోలవరం సందర్శించడానికి బాబు వెళ్లారు. అయితే సేమ్ టూ సేమ్ సోమిరెడ్డికు ఎదురైన సీన్ ఇక్కడ చంద్రబాబుకు ఎదురైంది. జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ మొదలుకుని కలెక్టర్లు, సంబంధిత అధికారులు రాకపోవడం గమనార్హం. దీంతో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి లోనయ్యారు. ఉన్ని కొద్దోగొప్పో అధికారులతో సమీక్ష చేసి తిన్నగా కరకట్టకు చేరుకున్నారు.
పోలవరం వెళ్లి బాబేం చేశారు..!?
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తొలిసారి పోలవరానికి చంద్రబాబు నిర్మాణ పనులు ఎలా నడుస్తున్నదానిపై అక్కడున్న కొద్ది మంది అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఎగువ,దిగువ కాపర్ డ్యామ్ పనులు, గేట్ల బిగింపు మెయిన్ డ్యామ్ పనుల్ని ఆయన పరిశీలించారు. ఈ పర్యటనకు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కలెక్టర్లు గైర్హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 కల్లా పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. కాగా.. 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని.. ఇది రాసిపెట్టుకోండి అంటూ నిండు అసెంబ్లీలో జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. మరి చంద్రబాబు చెబుతున్నట్లుగా 2020కు ఎలా సాధ్యమవుతుందో..? అసలు ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో..? ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు మరి.