BRS Party: ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. కారును పోలిన గుర్తులను తొలగించాలంటూ న్యాయస్థానంలో బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. చపాతీ రోలర్, రోడ్డు రోలర్, తదితర గుర్తులను ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కారును పోలిన గుర్తులతో నష్టపోయామని తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం బీఆర్ఎస్ పిటిషన్‌ను కొట్టేసింది.
ఓటర్లకు అన్ని విషయాలు తెలుసు..
భారతీయ ఓటర్లు రాజకీయ నిరక్షరాసులు కాదంటూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిథాల్‌తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్లకు కారు, చపాతి రోలర్, రోడ్డు రోలర్ తేడా తెలియదు అనుకుంటున్నారా? ఎన్నికలు వాయిదా వేయాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించింది. హైకోర్టు తీర్పు వచ్చిన 240 రోజుల తర్వాత సుప్రీంకోర్టుకు రావడం ఏంటి?. అధికార పార్టీగా ఉన్న మీకు ఈ విషయం తెలియదా? అంటూ బీఆర్ఎస్ న్యాయవాదులపై మండిపడింది. ఓటర్లకు అన్ని విషయాలు తెలుసంటూ ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
సీఈసీ ఫ్రీ సింబల్స్‌లో చపాతి రోలర్, రోడ్డు రోలర్, కెమెరా..
మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు ఫ్రీ సింబల్స్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో బీఆర్ఎస్ అభ్యంతరం చెబుతున్న చపాతి రోలర్, రోడ్డు రోలర్, కెమెరా వంటి గుర్తులు ఉండటం గమనార్హం. దీంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థనను సీఈసీ పరిగణనలోకి తీసుకోలేనట్లైంది. ఇటు సుప్రీంకోర్టు, అటు ఎన్నికల సంఘం నిర్ణయాలతో బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల జరిగిన దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో కారును పోలిన గుర్తులతో బీఆర్ఎస్ భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout