భారతదేశంలో నితిన్ పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను - పవన్ కళ్యాణ్
- IndiaGlitz, [Tuesday,May 03 2016]
యువ కథానాయకుడు నితిన్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అ ఆ. ఈ చిత్రంలో నితిన్ సరసన సమంత నటించింది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్నినిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన అ ఆ ఆడియో ఆవిష్కరణోత్సవం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో జరిగిన అ ఆ ఆడియో వేడుకలో హీరో నితిన్, హీరోయిన్ సమంత థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయగా... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై అ ఆ ఆడియోను ఆవిష్కరించారు.
గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ...ఈ చిత్రానికి నాలుగు మంచి పాటలు రాసాను. ఈ పాటలు రాసే క్రమంలో త్రివిక్రమ్ గారితో గడిపిన మూడు నాలుగు గంటలు చాలా విలువైనవి. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మిక్కీ జే మేయర్ తన పాత పద్దతిని పక్కన పెట్టి కొత్తగా ఉండే సంగీతాన్ని అందించారు.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మనందరికీ అ ఆ వినోదాన్ని అందిస్తుంది అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...తొలిప్రేమ సినిమా చూసి నితిన్ హీరో అవ్వాలనుకున్నాడు. హీరో అయిన తర్వాత ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తే సినిమా హిట్ అవుతుందని నితిన్ నమ్మకం. నితిన్ నమ్మకం తగ్గట్టు ఈ సినిమా సమ్మర్ లో మంచి హిట్ అవుతుంది. త్రివిక్రమ్ ఏది రాసినా కొత్తగా రాస్తారు. అ ఆ అందర్నీ ఆకట్టుకుంటుంది అన్నారు.
సీనియర్ హీరో నరేష్ మాట్లాడుతూ... నా కెరీర్ లోనే ది బెస్ట్ క్యారెక్టర్ ఈ చిత్రంలో చేసాను. అ ఆ మరచిపోలేని చిత్రంగా నిలుస్తుంది. నా గురువు జంథ్యాల వెళ్లిపోయారు అనుకున్నాను కానీ త్రివిక్రమ్ లో జంధ్యాల గార్ని చూస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ...త్రివిక్రమ్ గారు గురించి ఆయన సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలు ఎంత బాగుంటాయో అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ గారి సినిమాలోని డైలాగ్స్ చదువుకుంటే చాలు సినిమా తీసేయచ్చు. నితిన్, సమంత మంచి కాంబినేషన్... అన్నింటి కంటే మించి మంచి సంస్థలో ఈ చిత్రం రూపొందింది. మిక్కీ జే మేయర్ మంచి ట్యూన్ అందించారు. ఈ సాంగ్స్ ట్రెండ్ సెట్ సాంగ్స్ అవుతాయి. అ ఆ పెద్ద బ్లాక్ బష్టర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అన్నారు.
హీరోయన్ సమంత మాట్లాడుతూ...ఈ సినిమా నా హీరో కోసం.. నా డైరెక్టర్ కోసం.. నా నిర్మాత కోసం... సక్సెస్ అవ్వాలి. ఖచ్చితంగా మా సినిమా గెలుస్తుంది. ఆడియో ఫంక్షన్ కి పవర్ స్టార్ గెస్ట్ గా వచ్చారంటే సినిమా హిట్ అంతే..అన్నారు.
హీరో నితిన్ మాట్లాడుతూ... అ ఆ అంటే ఏమిటో త్రివిక్రమ్ గారి స్టైల్ లో చెప్పాలంటే... అందమైన ఆహ్లాదకరమైన సినిమా. అదే పవన్ కళ్యాణ్ గారి స్టైల్ లో చెబితే అ... ఆ... అంతే. సినిమాకి రియల్ హీరో నిర్మాత అని నమ్ముతాను. మా నిర్మాత రాథాకృష్ణ గారు ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు నచ్చాయి. ముఖ్యంగా శ్యామలా సాంగ్ నాకు బాగా నచ్చింది. త్రివిక్రమ్ గారు నడిచే లైబ్రెరీ లాంటివారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి క్షణం నా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. తొలిప్రేమ చూసి హీరో అవ్వాలనుకున్నాను. జయం సినిమా ఆడిషన్స్ లో డ్యాన్స్ చేయమంటే...పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమాలో స్టెప్స్ వేసాను. ఏదైనా సీన్ చేయమంటే....తమ్ముడు సినిమాలో కళ్యాణ్ గారు చేసిన కామెడీ సీన్ చేసాను...అలా నేను హీరో అవ్వడానికి కళ్యాణ్ గారే కారణం. ఇష్క్ ఆడియో ఫంక్షన్ కి వచ్చారు. ఇప్పుడు అ ఆ ఆడియో ఫంక్షన్ కి కూడా వచ్చినందుకు కళ్యాణ్ గార్కి మనస్పూర్తిగా థ్యాంక్స్ తెలియచేస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ...అ ఆ టైటిల్ ఎందుకు పెట్టారు అని కొంత మంది అడిగారు..మనం పని చేయడంలో.... గెలవడంలోపడి...మనం ఎక్కడ నుంచి ప్రారంభించాం.. మన మూలాలు ఏమిటి అనేది మరచిపోతున్నాం. అందుచేత మన మూలాల్ని వెతికే ప్రయత్నమే అ ఆ. కొన్ని జ్ఞాపకాలు..కొన్ని ప్రయాణాలు.. ఎప్పటికీ మరచిపోలేం. కొన్ని ప్రయాణాలును ఆపాలని అనిపించదు. కొన్ని అనుభూతులు ఎంత పంచుకున్నా సరిపోవు అనిపిస్తుంటుంది. నా స్నేహితులుతో మాట్లాడిన మాటలు...ఒక టీని ఇద్దరు స్నేహితులు కలిసి తాగిన రోజులు... వెనక్కి తిరిగి చూసుకుంటే మరచిపోలేని అనుభూతి కలుగుతుంది. అ ఆ అనేది చాలా కాలం క్రితం రాసేసిన డైరీ లాంటిది. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి నాకు బలంగా నిలబడిన వ్యక్తి నా నిర్మాత రాధాకృష్ణ గారు. ఈ సినిమా చూసిన వెంటనే ఆడియోన్స్ కి మంచి అనుభూతి ఇస్తుంది. హీరో సినిమానా... హీరోయిన్ సినిమానా అని అడగకుండా కథని నమ్మి చేసిన నితిన్ కి థ్యాంక్స్. అలాగే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు డేట్స్ ఇచ్చి అనసూయ పాత్రకు ప్రాణం పోసిన సమంత గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను.
అనుపమ పరమేశ్వరన్ చాలా బాగా నటించింది. ఖచ్చితంగా అనుపమ పరమేశ్వరన్ ని చాలా సంవత్సరాలు తెలుగు సినిమాల్లో చూస్తారు.మిక్కీ జే మేయర్ కథ చెప్పడం ప్రారంభించిన 10 నిమిషాలకే ఒక ట్యూన్ ఇచ్చేసాడు. ఈ చిత్రానికి చాలా మంచి ట్యూన్స్ అందించారు. సీతారామ శాస్త్రి గారు తర్వాత తెలుగు పాటకు గౌరవం తీసుకురాగల గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారు. ఈ చిత్రానికి ఆయన చాలా మంచి పాటలు రాసారు. అలాగే కృష్ణ చైతన్య కూడా మంచి పాటను రాసారు. కొండ ఒకరికి తల వంచదు.. శిఖరం కూడా తలవంచదు..కెరటం అలసిపోయి ఆగదు..నా ఉప్పెన... నేను దాచుకున్న సైన్యం... శత్రువులు పై నేను చేసే యుద్దం...నేను వదిలిన బాణం...నా పిడుగు..ఓ సునామి...ఇదంతా నా కిష్టమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్..ఈ ఆడియో వేడుకకు రావడం ఆనందంగా ఉంది అన్నారు.
హీరో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఇష్క్ సినిమా ఆడియో ఫంక్షన్ కి నేను ఎందుకు వచ్చానంటే...ఇష్క్ ఆడియో ఫంక్షన్ కి నన్ను పిలవడానికి వచ్చినప్పుడు నితిన్ నాకు తమ్ముడులాగా అనిపించాడు. నేను నా సినిమాల గురించి తప్పా... వేరే సినిమాలు ఎలా ఆడుతున్నాయి అని పట్టించుకోను. ఇష్క్ సినిమాకి ముందు నితిన్ కి నాలాగే హిట్స్ లేవని తెలిసింది. తమ్ముడుకి ఇబ్బంది అంటే ధైర్యం ఇద్దామని వస్తాం కదా...అందుకే ఇష్క్ ఆడియో ఫంక్షన్ కి వచ్చాను. అది మంచి విజయం సాధించింది. అలాగే అ ఆ సినిమా కూడా మంచి విజయం సాధించి... నితిన్ గార్కి మంచి పేరు రావాలని... భారతదేశంలో నితిన్ పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. అద్భుతమైన సంగీతం అందించారు. పాటలు వింటుంటే డ్యాన్స్ చేయాలనిపించింది. గోకులంలో సీత చిత్రానికి త్రివిక్రమ్ అసోసియేట్ రైటర్ గా వర్క్ చేసారు. ఆ చిత్రానికి చాలా డైలాగ్స్ త్రివిక్రమ్ రాసారు. ఆవిధంగా ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ నేను కలసి పని చేసాం. కానీ...అప్పటికి మా ఇద్దరికీ పరిచయం లేదు.
తొలి ప్రేమ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు పక్కనే చిరునవ్వుతో సినిమా రీ రికార్డింగ్ జరుగుతుంది. ఆ సినిమాలో రెస్టారెంట్ సీన్ లో డైలాగ్స్ చూసి భలే రాసారే బాగున్నాయి అనిపించింది. జల్సా నుంచి త్రివిక్రమ్ తో పరిచయం. ఆయన విలువలు గురించి కేవలం సినిమాలు తీయడం మాత్రమే కాదు...నిజ జీవితంలో విలువలు పాటించే వ్యక్తి అందుకే ఆయనంటే నాకు అంత ఇష్టం. హీరోకి ఎంత ఇమేజ్ వచ్చినా... దాని వెనక రచయిత బలం ఉందని బలంగా నమ్మే వ్యక్తిని. అందుకే రైటర్స్ అంటే నాకు గౌరవం. రచయిత త్రివిక్రమ్ మనకు ఉండడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. అత్తారింటికి దారేది చిత్రం కంటే ముందు నుంచి ఈ కథ తెలుసు. కుటుంబ సమేతంగా వెళ్లి చూడదగ్గ సినిమా ఇది అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నటి నదియా, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, నిర్మాత శరత్ మరార్, నిర్మాత నిఖితా రెడ్డి, అజయ్,కృష్ణ చైతన్య, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, పి.డి.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.