టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్న ‘96’ బ్యాక్‌డ్రాప్!
- IndiaGlitz, [Sunday,March 10 2019]
ప్రేమ తాలూకు జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తూ హృద్యమైన ఇతివృత్తంతో రూపొందిన తమిళ చిత్రం ‘96’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్‌సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం వాణిజ్యపరంగా కూడా మంచి వసూళ్లను సాధించింది. గడచిపోయిన ప్రణయ జ్ఞాపకాలకు అందమైన దృశ్యరూపంలా సాగిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్ని స్పృశించింది. 1996లో స్కూల్‌మేట్‌ను హీరో ప్రేమిస్తాడు.. అయితే లవ్ ప్రపోజ్ చేయడానికి హీరో భయపడతాడు.. కొన్నేళ్ల తర్వాత వారు రీయూనియన్‌కి మీట్ అవుతారు ఆ తర్వాత ఏం జరిగింది.. వారిద్దరూ కలిశారా లేదా అన్నది సినిమా. ఈ సినిమా మొత్తమ్మీద త్రిష అభినయం ప్రధానాకర్షణగా నిలిచింది. లవ్ ట్రాక్‌తో సినిమా రావడంతో జనాలంతా థియేటర్లకు క్యూ కట్టి ఊహించని రేంజ్‌లో సక్సెస్ కట్టబెట్టారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు విజయ్‌సేతుపతి ఈ సినిమా సక్సెస్ మరింత జోష్ ఇచ్చింది.
తెలుగులో ‘96’..
బాలీవుడ్, తమిళ, కన్నడ, మళయాల సినిమాల్లో సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు తెలుగులో కచ్చితంగా రీమేక్ చేయడానికి బడా ప్రొడ్యూసర్‌లు క్యూ కడతారన్న విషయం తెలిసిందే. ఈ 96 మూవీని సమంత, శర్వానంద్ జంటగా దిల్‌రాజు నిర్మాణంలో.. అదే తమిళ దర్శకుడు తెలుగులోకి తెరకెక్కిస్తున్నాడు. అయితే 96 థీమ్ కథలు ఇప్పుడు తెలుగులో బాగా ట్రెండ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు.
ట్రెండ్ సెట్టర్ 96 బ్యాక్‌డ్రాప్...
టాలీవుడ్‌లో ఇప్పటికే 90స్ బ్యాక్‌డ్రాప్ వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్టయ్యాయి. అయితే ఎప్పుడైతే తమిళ్‌లో ‘96’ మూవీ రికార్డ్ బ్రేక్ చేసిందో అప్పట్నుంచి అందరూ ఆ తరహా సినిమాలే తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా తెలుగులో లవ్ ట్రాక్‌తో వచ్చే సినిమా ఫెయిల్ దాఖలాలు పెద్దగా లేవనే చెప్పుకోవచ్చు. లవర్స్ అంతా థియేటర్లకు క్యూ కడితే సింప్లీ సూపర్బ్‌గా సినిమా సక్సెస్ అయిపోతుందని డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ గట్టినమ్మకం.
96 బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో వస్తున్న మరికొన్ని సినిమాలు
టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ నాగచైతన్య, సమంత.. పెళ్లికి తర్వాత కలిసి నటిస్తున్నారు. ఈ మజిలీ సినిమా కూడా 96 బ్యాక్‌డ్రాప్‌లోనే వస్తోంది. చైతూ ఓ అమ్మాయిని లవ్ చేయడం.. అది విఫలం కావడంతో ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇలా సినిమా సాగుతుంది. ‘నిన్నుకోరి’ తర్వాత శివనిర్వాణ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఈ ‘మజిలి’ చిత్రం ఇప్పటికే 80 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఆరు కోట్ల రూపాయలకి ‘జీ తెలుగు’ ఛానల్ వారు కొనుగోలు చేసినట్టుగా సమాచారం.
ఇక ‘జెర్సీ’ సినిమా విషయానికొస్తే..
వెండితెరపై వరుస హిట్లతో క్రేజీ హీరోగా మారిన నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘జెర్సీ’. ఈ మూవీని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా 1996 రంజీ మ్యాచ్‌ల (క్రికెట్) చుట్టూనే ఉంటుందని తెలుస్తోంది. నాని జెర్సీపై అర్జున్ ఉండటాన్ని బట్టి క్రికెట్ నేపథ్యంలో ఉండే కథలో నాని క్రికెటర్ అర్జున్‌గా కనిపించబోతున్నారని సమాచారం.
మొత్తమ్మీద చూస్తే.. ‘96’ మూవీ ఇప్పుడు తెలుగులో బాగా ఊపు పెంచిందన్న మాట. ప్రస్తుతం 96 బ్యాక్‌డ్రాప్‌లో ఒకటి కాదు రెండు కాదు మూడు సినిమాలు వస్తున్నాయ్. సో.. శర్వా, చైతూ, నాని 90, 96 బ్యాక్‌డ్రాప్ వచ్చేస్తున్నారు. వీటిలో ఏ సినిమా సక్సెస్ అవుతుందో తెలియాలంటే థియేటర్లలోకి వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే మరి.