తొలి చిత్రం `ఆర్.ఎక్స్ 100`తో హిట్ సాధించి కుర్రకారులో క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరో కార్తికేయ. అయితే ఈ హీరో హిప్పి, గుణ 369 చిత్రాలతో విజయాలను సొంతం చేసుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని తమ బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్‌లో చేసిన సినిమా `90 ఎం.ఎల్`. ఆర్.ఎక్స్ 100 తర్వాత ఇదే బ్యానర్‌లో కార్తికేయ నటిస్తోన్న చిత్రం కావడంతో సినిమా ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తి పెరిగింది. `90 ఎం.ఎల్` అనే టైటిల్ పెట్టడంతో పాటు టీజర్, ట్రైలర్ ఇదేదో తాగుబోతులకు సంబంధించిన సినిమా ఏమో అనేలా ఆసక్తిని పెంచింది. మరి అసలు `90 ఎం.ఎల్` సినిమా ఎలా ఉంది? అసలు కార్తికేయ ఈ సినిమా చేయడానికి రీజనేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం..
కథ:
పుట్టుకతోనే దేవదాస్(కార్తికేయ)కి ఫాటల్ ఆల్కహాలిక్ సిండ్రోమ్ ఉంటుంది. దీని కారణంగా ఇతను మూడు పూటలా మందు తాగకపోతే ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు కూడా చెప్పేస్తారు. అథరైజ్డ్ డ్రింకర్ అని డాక్టర్స్ సర్టిఫికేట్ కూడా ఇస్తాడు. పెద్దవాడైన దేవదాస్ తన సిండ్రోమ్ కారణంగా మంచి మార్కులున్నా, ఉద్యోగాన్ని సంపాదించుకోలేకపోతాడు. ఓ సందర్భంలో అతనికి సువాసన(నేహా సోలంకి) పరిచయం అవుతుంది. క్రమంగా ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే సువాసన తండ్రి క్షుణ్ణారావు(రావు రమేష్) టాఫ్రిక్ ఇన్సెపెక్టర్. అతనికి మందు తాగేవాళ్లంటేనే పడదు. సువాసన సహా ఆమె కుటుంబ సభ్యులకు నిజం తెలిసిపోతుంది. దేవదాస్‌కి సువాసన దూరమవుతుంది. అదే సమయంలో పెద్ద వ్యాపారవేత్త జాన్‌సన్(రవికిషన్) ఓ కారణంగా సువాసనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. అసలు సువాసనని జాన్‌సన్ ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు? మరి దేవా తన ప్రేమను ఎలా బ్రతికించుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
హీరోలకు సిండ్రోమ్ ఉండటం.. దాని చుట్టూ కథ తిరగడం.. తమ సమస్యను హీరోలు ఎలా అధిగమించి ప్రేమను సొంతం చేసుకున్నారనే కథాంశంతో ఇది వరకు చాలా సినిమాలే వచ్చాయి. ఉదాహరణకు భలే భలే మగాడివోయో, మహానుభావుడు ఇలంటి చిత్రాలకు ఉదాహరణలు. ఇప్పుడు అలాంటి ఓ డిఫరెంట్ సిండ్రోమ్‌తో రూపొందిన చిత్రమే `90 ఎం.ఎల్`. దర్శకుడు శేఖర్ రెడ్డి యెర్ర ఓ డిఫరెంట్ సిండ్రోమ్‌ను బేస్ చేసుకుని కథను తయారు చేసుకున్నాడు. దాని ఆధారంగానే సినిమాను కూడా తెరకెక్కించాడు. అయితే సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ను అక్కడక్కడా మాత్రమే మిక్స్ చేసి హీరోయిజం, లవ్ అంటూ సినిమాను అటు ఇటు తిప్పాడు. దీంతో సినిమాలో కొన్ని కామెడీ సన్నివేశాలు మినహా ఆసక్తికరంగా అనిపించదు. హీరో కార్తికేయ తన పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్ నేహా సోలంకి డీసెంట్‌గా తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. ఇక మెయిన్‌విలన్‌గా నటించిన రవికిషన్, అతని గ్యాంగ్ ప్రభాకర్, అదుర్స్ రఘు నటించిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇప్పటి వరకు విలన్‌గా నటించిన సత్యప్రకాశ్ ఈ చిత్రంలో సాఫ్ట్‌గా కనపడే తండ్రి పాత్రలో కనిపించాడు. రావు రమేశ్ రొటీన్ స్ట్రిట్ ఫాదర్ రోల్‌ను తనదైన స్టైల్లో రక్తికట్టించాడు. విలన్ గ్యాంగ్ క్రియేట్ చేసే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు ఓకే అనిపిస్తాయంతే. సినిమాకు అనూప్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం బాగా లేదు. యువరాజ్ సినిమాటోగ్రఫీ ఓకే. మొత్తంగా చూ్స్తే.. డిఫరెంట్ పాయింట్‌ను అనుకుని రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందింది
చివరగా.. '90 ఎం.ఎల్'.. కిక్కు లేని సినిమా
Comments