Janasena: మరో 9 మంది జనసేన అభ్యర్థులు ఖరారు.. ఎవరంటే..?

  • IndiaGlitz, [Thursday,March 14 2024]

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ముమ్మరం చేశారు. 21 స్థానాల్లో ఇప్పటికే 6 మంది అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో 9 మంది అభ్యర్థులను ఖరారుచేశారు. ఈమేరకు వారికి సమాచారాం అందించారు. బుధవారం రాత్రి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాయలంలో అభ్యర్థులతో భేటీ అయ్యారు. వారికి ఎన్నిన నిబంధనల పత్రాలను అందజేశారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేశ్‌ బాబు, ఎలమంచిలి నుంచి సుందరపు విజయకుమార్‌, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణయాదవ్‌, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్‌, ఉంగుటూరు నుంచి పత్సమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్‌, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి దేవవరప్రసాద్‌, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులుకు అవకాశం ఇచ్చారు.

వీరితో పవన్ మాట్లాడుతూ 2024 ఎన్నికలు రాష్ట్ర గతిని మార్చే ఎన్నికలని అభ్యర్థులకు పవన్ కల్యాణ్ తెలిపారు. అందుకే పొత్తులో భాగంగా తమకు కేటాయించిన స్థానాల్లో కచ్చితంగా గెలిచి తీరాలని సూచించారు. ప్రచారం సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై వివరించారు. పోలింగ్ పూర్తయ్యే దాకా ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించాలని తెలిపారు.

కాగా ఇప్పటికే నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్‌, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ పేర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఇప్పటివరకు 15 స్థానాల్లో అభ్యర్థులపై క్లారిటీ రాగా.. మిగిలిన ఆరు నియోజకవర్గాల అభ్యర్థులను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించున్నారు.

ఇందులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, విజయనగరం జిల్లాలోని పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు, ఏలూరు జిల్లాలోని పోలవరం స్థానాలు ఉన్నాయి. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీచేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు తిరుపతికి చెందిన సీనియర్ నేత గంటా నరహరి పార్టీలో చేరారు.