వైసీపీకి టచ్‌లో 8 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు!
- IndiaGlitz, [Friday,June 14 2019]
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. ప్రతిపక్షనేత చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టేలా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏకంగా వైసీపీకి టచ్‌లో ఉండే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సంఖ్యతో సహా చెప్పేశారు. ఓ ప్రముఖ టీవీ చానెల్ డిబెట్లో పాల్గొన్న ఆయన.. ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు వైసీపీ అధిష్టానానికి టచ్‌లో వున్నారని బాంబు పేల్చారు. అంతేకాదు.. ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు. టీడీపీకి భవిష్యత్ లేదని.. చంద్రబాబు తీరు మారదని ఆయా ఎమ్మెల్యేలు భావిస్తున్నారన్నారు. అంతేకాదు.. టీడీపీని వీడతామని చెప్పిన ఆయా ఎమ్మెల్యేలు తమకు ఎటువంటి పదవి అక్కర్లేదని.. జగన్‌కు మంచి భవిష్యత్ ఉందని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ తమకు పోటీ చేసే అవకాశం కల్పిస్తే చాలని వారు తమ అధిష్టానానికి విన్నవించుకున్నారని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.
సంయమనం పాటిస్తా!
అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఎంత రెచ్చగొట్టినా మేం సంయమనం పాటిస్తాం. టీడీపీ సభ్యులు మరీ శృతి మించితే కనుక సభా నియమాల ప్రకారం స్పీకర్ చర్యలు తీసుకుంటారు. 2019లో ప్రజలు నమ్మకంతో మాకు ఓటు వేశారు. 2024లో మా పనితీరు చూసి ప్రజలు ఓటేయాలని, అధికారం చేతికొచ్చిందని ఎవరూ అహంకార పడొద్దు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని.. నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించాలి. అవినీతి లేని సమాజాన్ని అందించాలని మా అధినేత జగన్ మాకు పదేపదే చెబుతుంటారు. ఆ మాటకు కట్టుబడతాము. సభా సంప్రదాయాలను గౌరవిస్తాము. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు చేస్తాము. ప్రతిపక్షం కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోటంరెడ్డి ఈ సందర్భంగా కోరారు.
అయితే.. అన్నీ చెప్పిన కోటంరెడ్డి ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరు..? ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు ఎవరు..? అనే విషయం చెప్పడానికి సాహసించలేదు. ఈ విషయంలో మాత్రం వైసీపీ చాలా గోప్యంగా ఉంచుతోంది. అయితే ఫైనల్‌గా టీడీపీకి టాటా చెప్పి వైసీపీలో చేరే వాళ్లు ఎంతమందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.