హైదరాబాద్ నెహ్రూ జూ పార్కులో 8 సింహాలకు కరోనా లక్షణాలు!
- IndiaGlitz, [Tuesday,May 04 2021]
దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో కరోనా విలయం సృష్టిస్తోంది. ఇక తెలంగాణలో మనుషులకే కాదు.. జంతువులకు సైతం కరోనా సోకినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్కులో 8 సింహాలకు కరోనా లక్షణాలున్నట్టు జూ అధికారులు గుర్తించారు. సింహాల నుంచి శాంపిల్స్ సేకరించి వాటిని జూ అధికారులు పరీక్షల నిమిత్తం సీసీఎంబీకి పంపించారు. జూపార్క్‌లో సందర్శకులకు అనుమతిని నిరాకరించారు. సీసీఎంబీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
ఈ 8 సింహాల రిపోర్ట్స్ ఇవాళ(మంగళవారం) వచ్చే అవకాశం ఉంది. నివేదికలో ఏం వస్తుందోనని అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. సెకండ్ వేవ్ లో జంతువులకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ 8 సింహాలకూ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయితే మిగిలిన జంతువులతో పాటు అక్కడ పని చేసే సిబ్బంది పరిస్థితి ఏంటని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు పార్కులను మూసివేశారు. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి జూ పార్కులో సందర్శకులకు జూ అధికారులు అనుమతి నిరాకరించారు.
కాగా.. తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు నమోదు అయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 59 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 2,476కు చేరుకుంది. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 4,63,361కి చేరుకుంది. ప్రస్తుతం తెలంగాణలో 79,520 యాక్టివ్ కేసులుండగా.. 3,81,365 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 1,029, మేడ్చల్ 507, నల్గొండ 402, రంగారెడ్డి 387 కేసులు నమోదయ్యాయి.