పెండింగ్ చలాన్ల క్లియరెన్స్: పోటెత్తిన జనం.. సర్వర్ క్రాష్, తొలి రోజు ఎన్ని కోట్ల ఆదాయమంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ ప్రక్రియకు తెలంగాణ పోలీసులు మంగళవారం నుంచి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందది. గరిష్టంగా 75 శాతం డిస్కౌంట్ ప్రకటించడంతో చలాన్ల చెల్లింపునకు తొలి రోజు నుంచే వాహనాదారులు పోటెత్తారు. నిమిషానికి 700 చొప్పున క్లియరెన్సులు కాగా, ప్రభుత్వ ఖజానాకి కోట్ల రూపాయలు జమ అయ్యాయి. అయితే ట్రాఫిక్ కారణంగా ఈ-చలాన్ సర్వర్ కుప్పకూలింది. వెబ్ సైట్ క్రాష్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తొలిరోజు ఒకటి నుంచి 3 లక్షలమంది చలానాలు చెల్లించే అవకాశాలున్నాయన్న అంచనాతో సర్వర్‌ను సిద్ధం చేశారు అధికారులు. జరిమానా చెల్లించేప్పుడు వాహనం రిజిస్ట్రేషన్ నంబరుతో పాటు ఇంజిన్ నంబరులోని చివరి నాలుగు అంకెలు కూడా నమోదుచేయాల్సి వుంటుంది. అయితే అంచనాలకు మించి వాహనదారులు ఈ-చలాన్ వెబ్‌సైట్‌ను సందర్శించడంతో సర్వర్ క్రాష్ అయ్యింది. ఇవాళ 5 లక్షలకు పైగా పెండింగ్ చలాన్లను వాహనదారులు క్లియర్ చేసినట్లుగా సమాచారం. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్‌తో పోలీస్ శాఖకు రూ.5.5 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా.. తెలంగాణ పోలీసులు పెండింగ్ చలాన్ల చెల్లింపుపై మార్చి 1 నుంచి 30వ తేదీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే, నెట్‌బ్యాంకింగ్‌లతో పాటు మీసేవ / ఈసేవ కేంద్రాల్లోనూ జరిమానాలు చెల్లించేందుకు పోలీస్ శాఖ అనుమతించింది. ద్విచక్ర వాహనాలకు 75 శాతం రాయితీని ప్రకటించగా.. కార్లు, మోటార్ వెహికల్స్‌కు 50 శాతం రాయితీ ఇచ్చారు. అలాగే తోపుడు బండ్ల నిర్వాహకులకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం రాయితీలను ప్రకటించారు. ఇక.. మాస్కు ధరించకుండా తిరిగిన వారికి విధించిన రూ.వెయ్యి రూపాయల జరిమానాకు బదులు కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుందని పోలీస్ శాఖ తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments