వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్లు జైలు శిక్ష..: కేంద్ర ప్రభుత్వం

  • IndiaGlitz, [Wednesday,April 22 2020]

కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా రోగులు, వారి బంధువులు, క్వారంటైన్‌లో ఉన్నవారు.. దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాదు కొందరు డాక్టర్లపై ఉమ్మేయడం.. వారిపై తుమ్మడం కూడా చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో తమకు రక్షణ కల్పించాలని వైద్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ లేఖలు రాశాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. బుధవారం నాడు కేబినెట్ భేటీ ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యులపై దాడులను నిరోధించేందుకు ఆర్డినెన్స్‌ తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. 1897 ఎపిడెమిక్‌ చట్టంలో మార్పులు తెస్తూ ఈ ఏడాదిలోగా విచారణ పూర్తయ్యేలా ఆర్డినెన్స్‌ను తీసుకురానున్నట్లు కీలక ప్రకటన చేసింది. అయితే ఈ ఆర్డినెన్స్ అనేది ఇప్పుడు కరోనా సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా ఆర్డినెన్స్‌ అమల్లో ఉండనుంది.

ఏడేళ్లు జైలు శిక్ష..

ఇవాళ కేబినెట్ భేటీ అనంతరం మీడియా మీట్ నిర్వహించిన కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌.. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలపై దాడులు అమానుషం, అవమానకరమన్నారు. వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు చేపడతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దాడులకు పాల్పడితే మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తామని.. అంతేకాదు.. నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్లు జారీ చేస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. ఈ రెండితో పాటు.. దాడులకు పాల్పడేవారికి లక్ష నుంచి రూ.8లక్షల వరకూ జరిమానా కూడా విధిస్తామని చెప్పారు. త్వరలోనే ఇందుకు సంబంధించి ఆర్డినెన్స్ ఉంటుందన్నారు. రాష్ట్రపతి సంతకంతో వెంటనే ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందన్నారు. వాహనాలు, ఆస్పత్రులపై దాడిచేస్తే వాటి మార్కెట్‌ విలువ కంటే రెండింతలు జరిమానా రూపంలో వసూలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

హామీ.. శుభవార్త..!

డాక్టర్లకు వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పిస్తామని అభయమిచ్చిన కేంద్రం ఓ శుభవార్తను కూడా తెలియజేసింది. కరోనా నేపథ్యంలో విధుల్లో ఉన్న ఆరోగ్య సిబ్బందికి రూ 50 లక్షల బీమా సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. అలాగే కోవిడ్ బాధితులకు ఆయుష్మాన్ పథకం కింద చికిత్స కూడా ప్రభుత్వమే అందిస్తుందన్నారు. దేశంలో మొత్తం 735 ఆస్పత్రులు ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఎన్-95 మాస్కులు 90 లక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో 50 లక్షల మాస్క్‌లకు ఆర్డరిచ్చామని, వైద్య పరికరాల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని కేంద్ర మంత్రి జవదేకర్‌ వెల్లడించారు.