చాపకింద నీరులా ఒమిక్రాన్‌ .. మహారాష్ట్రలో ఒకేసారి 7 కేసులు, భారత్‌లో 12కి చేరిన సంఖ్య

  • IndiaGlitz, [Monday,December 06 2021]

అనుకున్నదంతా అయ్యింది. నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తోన్నదే జరుగుతోంది. భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులాగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. రెండు రోజుల క్రితం రెండు కేసులే వుండగా.. అది ఇప్పుడు 12కి చేరుకుంది. ఆదివారం మహారాష్ట్రలో ఒకేసారి ఏడు కేసులు వెలుగులోకి రావడంతో కేంద్రం ఉలిక్కిపడింది. ఇటీవల నైజీరియా నుంచి వచ్చిన మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్‌కు చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆమె సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఈ వేరియంట్‌ వెలుగుచూసింది. అలాగే ఫిన్లాండ్‌ నుంచి పుణె వచ్చిన మరో వ్యక్తిలోనూ ఒమిక్రాన్ వైరస్‌ గుర్తించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 8కి చేరగా.. దేశంలో 12కి చేరుకుంది. ప్రస్తుతం కర్ణాటకలో రెండు, గుజరాత్, ఢిల్లీలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

ఆదివారం ఉదయం కొత్తగా ఢిల్లీలో కేసు వెలుగుచూసింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్‌ వైరస్‌ను గుర్తించారు. పాజిటివ్‌ వచ్చిన మొత్తం 17 మంది ప్రయాణికుల్లో 12 మంది నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించామని, అందులో ఒకరికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయిందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ చెప్పారు. ప్రస్తుతం వారంతా ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు.