7 kg Gold:బ్యాంకులో 7కిలోల బంగారం మాయం.. మహిళా ఉద్యోగిని సూసైడ్..
- IndiaGlitz, [Friday,December 01 2023]
వివిధ అవసరాల కోసం బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమైంది. దీంతో కస్టమర్స్ తీవ్ర ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు రంగంలోకి దిగడంతో 7 కిలోల బంగారం మాయమైనట్లు తేలింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో సంచలనం సృష్టించింది. గార ఎస్బీఐ బ్యాంకులో సదరు ఖాతాదారులు రుణాలు తీర్చినా వారికి బంగారం ఇవ్వకపోవడంతో ఆందోళనకు దిగారు. దాదాపు రూ.4 కోట్ల విలువైన బంగారం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణకు ముందే బ్యాంకులో పని చేస్తున్న మహిళా ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది.
డబ్బులు కట్టినా బంగారం ఇవ్వకపోవడంతో ఆందోళన చేస్తున్న ఖాతాదారులకు ఆడిట్ కారణంగానే జాప్యం జరుగుతోందని శ్రీకాకుళం రీజినల్ మేనేజర్ సర్దిచెప్పారు. డిసెంబర్ 8 లోపు బంగారం అప్పగిస్తామని హామీ ఇచ్చారు. బంగారం గల్లంతు వ్యవహారంలో గోల్డ్ లోన్స్ బాధ్యతలు చూసే డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియను బాధ్యురాలిని చేస్తూ నవంబర్ 20 నుంచి సెలవుపై పంపారు. అనంతరం రెండుసార్లు విచారణకు పిలిపించారు. అయితే ఈ సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంగారం మాయం వ్యవహారంలో ఉద్యోగుల ప్రమేయం కూడా ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది.
బంగారం మాయం కావడంలో ఉద్యోగుల పాత్రపై అనుమానం ఉందంటూ ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రాజు, బ్రాంచి మేనేజర్ రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదుచేశారు. రూ.4కోట్ల విలువైన 7 కేజీల బంగారం ఆభరణాలు మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొ్ననారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఉద్యోగిని ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. తమ బంగారం తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.