KCR:చిన్న పొరపాటు వల్ల 60 ఏళ్లు గోసపడ్డాం.. మరోసారి అలాంటి తప్పు చేయవద్దు: కేసీఆర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ రాక ముందు పాలమూరు జిల్లాలో పర్యటిస్తే కన్నీళ్లు వచ్చేవని సీఎం కేసీఆర్ తెలిపారు. జడ్చర్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ పలు అంశాలపై ప్రసంగించారు. ఉద్యమంలో 'పక్కనే కృష్ణమ్మ ఉన్న ఫలితం లేకపాయే, పాలమూరు, నల్గొండ, ఖమ్మమెట్టు పంటలు ఎండిపాయే' అనే పాట రాశానని తెలిపారు. పాలమూరు ఎప్పుడు తన గుండెల్లో ఉంటుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ సలహాతో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించానని పేర్కొన్నారు. పాలమూరు దరిద్రం పోవాలంటే ఇక్కడి నుంచే పోటీ చేయాలని ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారని జయశంకర్ సార్ చెప్పారన్నారు.
తెలంగాణ ఎవరూ ఇవ్వలేదు.. చావు నోట్లో తలకాయ పెట్టి సాధించా..
మహబూబ్ నగర్ ఎంపీగా ఉంటూనే తెలంగాణ రాష్ట్రం సాధించానని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఎవరూ ఇవ్వలేదని..పోరాటం చేసి సాధించామని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారని.. తాను కూడా చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించానని వెల్లడించారు. కాంగ్రెస్ చేసిన పొరపాటు వల్ల 60 ఏళ్లు గోసపడ్డామన్నారు. 1956లో చిన్న పొరపాటు జరిగింది.. మనల్ని తీసుకెళ్లి ఏపీలో కలిపారని.. దాంతో పాలమూరు జిల్లా కరువుతో ఖాళీ, వలస పోయిందని తెలిపారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పాలించినా నీళ్లు ఇవ్వలేదన్నారు. 9టీఎంసీల నీరు ఉండే జూరాల నుంచి నీళ్లు ఇస్తారంట.. ఆ నీళ్లు ఇస్తే రెండు రోజుల్లో జూరాల ఎండిపోతుందన్నారు. శ్రీశైలంలో మనకు వాటా ఉంది కాబట్టే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి నీళ్లు తెచ్చామని గుర్తు చేశారు.
24 గంటల కరెంట్ కావాలో.. మూడు గంటలు కావాలో..
9 ఏళ్ల పోరాటం తర్వాత పాలమూరు ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయన్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్ రిజర్వాయర్లు, టన్నెల్స్ పూర్తయ్యాయని.. రాబోయే 3, 4 నెలల్లో అన్ని రిజర్వాయర్లలో బ్రహ్మాండంగా నీళ్లను చూడబోతున్నామన్నారు. ఉద్దండాపూర్ ప్రాజెక్టు పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గంలోని 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పారు. కరువు అనేది మన వైపు కన్నెత్తి కూడా చూడదని.. పాలమూరు పాలుకారే జిల్లాగా మారుతుందని కేసీఆర్ పేర్కొ్న్నారు. హైదరాబాద్‌కు సమీపంగా ఉండే జడ్చర్లను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు కేవలం 3 గంటల కరెంట్ చాలు అంటున్నారని.. 24 గంటల కరెంట్ కావాలో, మూడు గంటలు చాలో తేల్చేకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జడ్జర్లలో మరోసారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments