Tirumala:తిరుమలలో విషాదం .. చిన్నారిని చంపేసిన చిరుత, తల్లిదండ్రుల ముందే అడవిలోకి లాక్కెళ్లి
- IndiaGlitz, [Saturday,August 12 2023]
తిరుమలలో దారుణం జరిగింది. అలిపిరి నడక మార్గంలో ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో లక్షిత అనే చిన్నారి తన కుటుంబ సభ్యులతో కలిసి నడక దారిలో శ్రీవారి దర్శనానికి బయల్దేరింది. రాత్రి 11 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు చేరుకున్నారు.. కుటుంబ సభ్యులు వెనుక వుండగా ముందు వెళ్తున్న చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేసింది. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు తేరుకునేలోపే చిరుత పాపను అడవిలోకి ఈడ్చుకెళ్లింది.
ఉదయం చెట్ల పొదల్లో కనిపించిన చిన్నారి మృతదేహం :
దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేపట్టేందుకు వీలు పడలేదు. శనివారం తెల్లవారగానే గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కొద్దిదూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. తొలుత ఎలుగు బంటి దాడిలో చిన్నారి మరణించినట్లుగా పోలీసులు, అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే చిరుత దాడిలోనే పాప మృతిచెందినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలింది. తిరుపతి రుయా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దైవ దర్శనానికి వచ్చి ఇలా బిడ్డను కోల్పోవడంతో పాప తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి :
మరోవైపు చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారి లక్షిత మరణం అత్యంత బాధాకరమన్నారు. కళ్లముందే బిడ్డను క్రూర జంతువు లాక్కెళ్తే ఆ బాధ వర్ణనాతీతమని.. ఈ మేరకు చిన్నారి తల్లిదండ్రులకు చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీటీడీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టి వుంటే ఈ ఘోరం జరిగేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.