ఆరేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసిన 14ఏళ్ల బాలుడు.. 3లక్షలు డిమాండ్!
- IndiaGlitz, [Tuesday,November 19 2019]
టైటిల్ చూడగానే ఇదేదో సినిమాలో అనుకునేరు.. అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే మరి. అక్కడికీ నమ్మకంగా అనిపించట్లేదు కదా.. ఇదిగో ఈ వార్త చదవండి అసలు విషయమేంటో అర్థమవుతుంది. అంతేకాదండోయ్.. ఈ ఘటన మరెక్కడో కాదు జరిగింది.. మన హైదరాబాద్ మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే చోటుచేసుకుంది. అసలేం జరిగింది..? ఎందుకు కిడ్నాప్ చేశాడు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హీరో లెవల్‌లో వార్నింగ్!
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజు దంపతులకు అర్జున్(6) కుమారుడు ఉన్నాడు. ఆ బాలుడు స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. అయితే.. ఆదివారం మధ్యాహ్నం కాలనీలో ఆడుకుంటూ మిస్సయ్యాడు. అయితే కాసేపటికే ఓ నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ‘నీ కొడుకును కిడ్నాప్ చేశాను. నీ కొడుకు నీకు దక్కాలంటే రూ.3లక్షలు ఇవ్వు. ఇప్పటికిప్పుడు రూ.లక్ష కావాలి. కొంత సొమ్ము ‘ఫోన్ పే’ చెయ్యు’ అనేదే ఆ ఫోన్ కాల్ సారాంశం. ఇదంతా పదో తరగతి చదివే పిల్లాడు చేసిన తంతు. అది కూడా సినిమాలో హీరో లెవల్‌లో వార్నింగ్ ఇవ్వడం గమనార్హం!
ఇలా పట్టుకున్నారు..!
ఈ ఫోన్ కాల్‌తో బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే రాచకొండ పోలీసులను తల్లిదండ్రులు ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అయితే ఘటనాస్థలికి వెళ్లి ఆ పద్నాలుగేళ్ల బాలుడ్ని చూసి పోలీసులే కంగుతిన్నారు. వీడా కిడ్నాప్ చేసిందని ముక్కున వేలేసుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. మరోవైపు బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పగించారు. సో.. సినిమాల ప్రభావం ఎలా ఉంటుందో ఈ కిడ్నాప్‌ను బట్టి చూస్తే అర్థమవుతుందన్న మాట.