హైదరాబాద్‌ మురుగు నీరు చెప్పిన నిజం.. 6.6 లక్షల మందికి కరోనా!

  • IndiaGlitz, [Thursday,August 20 2020]

హైదరాబాద్‌లో ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలకూ.. టైటిల్‌కూ ఏమాత్రం సంబంధం లేకుండా ఉందా? అసలు నిజమైతే ఇదేనని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ), సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) సంస్థలు సంయుక్తంగా వెల్లడించాయి. హైదరాబాద్ వాసులు వాడిన మురుగు నీరు చెప్పిన నిజమిది. మురుగునీటి నమూనాలపై సంయుక్త పరిశోధనలు నిర్వహించగా హైదరాబాద్‌లో 6.6 లక్షల మందికి కరోనా సోకి 35 రోజుల్లో సాధారణ స్థితికి వచ్చిందని అంచనాకు వచ్చారు.

నగరంలోని ఒక ప్రాంతంలో ఎక్కువని.. ఒక ప్రాంతంలో తక్కువంటూ లేదని అన్ని ప్రాంతాల్లోనూ సమాన స్థాయిలోనే వైరస్ విస్తరించిందని పరిశోధనల ద్వారా వెల్లడైంది.
మురుగు నీటి నమూనాలను పరీక్షించడం ద్వారా సంక్రమిక వ్యాధుల వ్యాప్తిని నిర్ధారిస్తారు. అయితే కరోనా నోటి తుంపర్లు, నాసికా స్రావాల నుంచే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా బహిర్గతమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సంయుక్త పరిశోధన కొనసాగింది. ఒక వ్యక్తికి కరోనా సోకిన దగ్గర నుంచి తగ్గినా సరే.. దాదాపు 35 రోజుల వరకూ వైరస్ పదార్థాల మల మూత్రాల ద్వారా విడుదలవుతూనే ఉంటాయి.

ప్రతి ఇంట్లో నుంచి వచ్చే మురుగు ఆధారంగా కరోనా పాజిటివ్‌లు ఎంతమందనే పరిశోధన సాగింది. శుద్ధి చేసిన మురుగును పరీక్షించడం ద్వారా 2 లక్షల మంది విసర్జితాల్లో వైరస్ విడుదలైందని పరిశోధకులు తేల్చారు. ఇక శుద్ధి చేయని మురుగును కూడా కలిపితే 6.6 లక్షల మంది కరోనా బారిన పడి కోలుకుని ఉంటారని పరిశోధకులు అంచనా వేశారు. అది కూడా కేవలం గత 35 రోజుల్లోనే కావడం గమనార్హం. అయితే రోగ లక్షణాలు లేని వారు మాత్రం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.