దేశంలో షాకిస్తున్న కరోనా.. నేడు 57 వేలు దాటిన కేసులు
- IndiaGlitz, [Saturday,August 01 2020]
దేశంలో కరోనా వైరస్ కేసులు షాక్కు గురి చేస్తున్నాయి. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కరోనా హెల్త్ బులిటెన్ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 57,117 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంత భారీ మొత్తంలో కరోనా కేసులు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒక్క జూలై నెలలో 11.1 లక్షల కరోనా కేసులు నమోదవడం గమనార్హం. ఇది జూన్ నెలతో పోలిస్తే 2.8 శాతం అధికం.
కాగా ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,95,988కి చేరుకుంది. నేడు కరోనాతో దేశ వ్యాప్తంగా 764 మంది మృతి చెందగా.. మొత్తంగా 36,511 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,65,103 యాక్టివ్ కేసులుండగా.. 10,94,374 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా కేసుల సంఖ్య 10వేల పైచిలుకు నమోదవడం.. మరణాల సంఖ్య 750కి పైగా నమోదవడం నాలుగు రోజులుగా జరుగుతోంది.