సినిమా థియేటర్లలో 50 శాతం నిబంధన సడలింపు..
- IndiaGlitz, [Thursday,January 28 2021]
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న లాక్‌డౌన్ మార్గదర్శకాలను మరోసారి పొడిగించింది. ఈ మేరకు నవంబర్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత మార్గదర్శకాలే ఫిబ్రవరి నెలకూ వర్తిస్తాయని కేంద్రం వెల్లడించింది. అయితే కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతుండటంతో కొన్ని నిబంధనలకు సడలింపులను ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా మార్గదర్శకాలను జారీ చేశారు.
కరోనా నిబంధనల సడలింపులు..
గతంలో 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతిచ్చిన కేంద్రం ఈ సారి అంతకన్నా ఎక్కువ సామర్థ్యంతో థియేటర్లను నడుపుకోవచ్చని కేంద్రం తెలిపింది.
ఇక మీదట స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్లేందుకు అందరికీ కేంద్రం అనుమతినిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రాబోయే కొత్త మార్గదర్శకాలను ఆయా శాఖలు విడుదల చేస్తాయని వెల్లడించింది.
అన్ని రకాల ఎగ్జిబిషన్ హాళ్లు తెరిచేందుకు కేంద్రం అనుమతించింది.
కంటైన్‌మెంట్ జోన్ల వెలుపలి అన్ని కార్యకలాపాలకూ అనుమతి
పౌర విమానయాన శాఖతో సమీక్షించిన మీదట అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిర్ణయం తీసుకుంటామని కేంద్రం తెలిపింది.
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేందుకు ఎలాంటి అనుమతులూ అక్కర్లేదు
సామాజిక/సాంస్కృతిక తదితర సంబంధిత సభలు, సమావేశాలకు హాలు సామర్థ్యంలో 50 శాతం నిబంధనను సడలించింది. దీనిపై రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతికి అవకాశం