వెంటిలేటర్‌పై ఐదేళ్ల పాప.. యూనిట్ రక్తం.. ప్రపంచమంతా గాలించారు.. చివరకు..
Send us your feedback to audioarticles@vaarta.com
వెంటిలేటర్‌పై ఐదేళ్ల చిన్నారి.. ఎలాగైనా బతికించాలనే తాపత్రయం.. కనీసం ఒక్క యూనిట్ బ్లడ్ దొరికినా చాలు.. దేశం మొత్తం గాలించారు.. ప్రపంచంలోనే పేరుగాంచిన బ్లడ్ బ్యాంకులన్నీ సంప్రదించారు. చివరకు మన దేశంలోనే సాధించారు. దాదాపు 20 రోజుల తర్వాత ఒక్క యూనిట్ రక్తం దొరికింది. చాలా విచిత్రంగా ఉంది కదా.. ఏదో సినిమా కథలా ఉంది కదా.. కానీ నిజ జీవితంలో జరిగిన కథ. ఒక్క యూనిట్ రక్తం కోసం దేశమంతా గాలించాలా? అనిపిస్తోంది కదా.. కొన్నిసార్లు తప్పదు మరి. ఆ పాపది అంత అరుదైన బ్లడ్ గ్రూప్.. మొత్తం దేశంలోని ఇన్ని కోట్ల మందిలో ముగ్గురికి మాత్రమే ఉంటుంది. దీనికి హాస్పిటల్ ఓ టీంని ఏర్పాటు చేసింది. ఆ టీంకు పాపకు ఎలాగైనా ఒక్క యూనిట్ బ్లడ్ సంపాదించడమే పని.
గుజరాత్‌కు చెందిన ఐదేళ్ల అనుష్క సంతోష్ అనే పాప మేడ మీద ఆడుకుంటూ కిందపడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. అనుష్కది అరుదైన బ్లడ్ గ్రూప్ కావడంతో అక్కడి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందించిన ఫలితం లేకపోయింది. పాప బ్లడ్ గ్రూప్ పేరు ‘పీపీ’ లేదా ‘పీ నల్’. ఎక్కడా విన్నట్టు కూడా అనిపించడం లేదు కదా.. సరే వెంటనే పాపను కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళానికి తరలించారు. అక్కడ అమృత అనే హాస్పిటల్లో అనుష్కకు చికిత్స ప్రారంభమైంది. చివరకు పాపను వెంటిలేషన్‌పై ఉంచాల్సి వచ్చింది. ఎలాగైనా పాప కోసం ఒక్క యూనిట్ బ్లడ్ అయినా సంపాదించాలి. దీనిలో భాగంగా ట్విట్టర్ ఫాలోయర్స్ ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ నేత శశిథరూర్‌ను ఎంచుకున్నారు. జులై మొదటి వారంలో ఆయనను సంప్రదించగా.. ఆయన వెంటనే ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌ను చూసిన ఆయన ఫాలోయర్లు విస్తృతంగా ఈ ట్వీట్‌ను వైరల్ చేశారు. దీనిపై వైద్యులు, బ్లడ్ బ్యాంకులు, ఎన్జీవోలు ఒకరేమిటి ఎందరో స్పందించారు.. తమ ప్రయత్నం తాము చేశారు. కానీ ఫలితం శూన్యం. ఈ క్రమంలోనే జపాన్ రెడ్ క్రాస్ సొసైటి, న్యూయార్క్ బ్లడ్ సెంటర్‌తో పాటు ఎన్నో అంతర్జాతీయ బ్లడ్ బ్యాంకుల్లో శోధించారు. అయినా నిరాశే మిగిలింది. చివరకు దీనిపై ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనోహెమటాలజీ సంస్థలో పని చేసే డాక్టర్ స్వాతి కులకుర్ణి స్పందించారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఉన్నట్టు తనకు సమాచారముందని హాస్పిటల్‌కు తెలిపారు. వెంటనే హాస్పిటల్ యాజమాన్యం నాసిక్‌లోని అర్పన్ బ్లడ్ బ్యాంకును సంప్రదించింది.
చొరవ తీసుకున్న బ్లడ్ బ్యాంకు నిర్వాహకులు వెంటనే ఆ దాతను పట్టుకుని నాసిక్‌కు తీసుకొచ్చి పాప బ్లడ్తో మ్యాచ్ అవుతుందో లేదోనని చెక్ చేశారు. పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అయితే లాక్డౌన్ కారణంగా ఫ్లైట్స్ లేవు. బ్లడ్‌ను కేరళకు తరలించడమనేది అది కూడా గడ్డ కట్టకుండా.. ఓ ఛాలెంజ్. దీనికి ఓ కొరియర్ సర్వీస్ సంస్థ సహకారం అందించింది. కంట్రోల్డ్ టెంపరేచర్ ఉండే ఓ కంటెైనర్లో జాగ్రత్తగా కేరళకు తరలించారు. ఇక పాపకు ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరి కృషి చెప్పుకోదగినదే. ఎవ్వరూ కూడా ఐదేళ్ల పాప మాకేంటిలే అని వదిలేయదు. ప్రతి ఒక్కరూ తమకు చేతనైన సాయం అందించారు. ఈ అందరి కృషి ఫలించి పాప క్షేమంగా బయటకు వచ్చి తీరుతుందని ఆశిద్దాం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments