జనవరిలో సందడే సందడి.. 5 సినిమాల రిలీజ్ డేట్ అనౌన్స్..
Send us your feedback to audioarticles@vaarta.com
లాక్‌డౌన్ కారణంగా మూత పడిన థియేటర్లన్నీ దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అయితే డిసెంబర్‌లో మాత్రం క్రిస్టమస్ కానుకగా.. ‘సోలో’గా వచ్చి సాయి తేజ్ సక్సెస్ అయ్యాడు. ఇక జనవరిలో మాత్రం సినిమాల జోరు పెరిగింది. ఈ నెలలో సందడి చేయడానికి ఐదు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆ ఐదు సినిమాల చిత్ర బృందాలు రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశాయి. సంక్రాంతికి ముందు రెండు సినిమాలు.. పండుగ రోజు ఒక సినిమా.. పండుగ తర్వాత రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'క్రాక్'. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై బి.మధు(ఠాగూర్ మధు) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జనవరి 9న విడుదల కాబోతోంది. తొలుత ఈ సినిమాను సంక్రాంతి పండుగ రోజున అంటే జనవరి 14న విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ సంక్రాంతి సందడిని ముందుగానే తీసుకొచ్చేందుకు సిద్ధమైన ఈసినిమా రిలీజ్ డేట్‌ను ప్రీ పోన్ చేసుకుని.. జనవరి 9నే విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
తమిళ సూపర్ స్టార్, ఇళయదళపతి విజయ్. తాజాగా ఆయన లేటెస్ట్ మూవీ 'మాస్టర్' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ 'మాస్టర్' థియేటర్స్‌లో అడుగు పెట్టేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో జనవరి 13న ఈ సినిమా రిలీజ్ అవుతుండగా.. హిందీలో మాత్రం జనవరి 14న విడుదలవుతోంది. ఈ సినిమాలో మరో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనుండటంతో ఈ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలున్నాయి.
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసిన చిత్రం ‘రెడ్’. రామ్‌తో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగి’ వంటి క్లాస్ మూవీస్‌ను రూపొందించిన తిరుమల కిశోర్ ‘రెడ్’కు దర్శకత్వం వహించారు. మాళవిక శర్మ, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ రోజున అంటే జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన ఫ్యామిలి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘అల్లుడు అదుర్స్’. నభా నటేష్, అను ఎమ్మాన్యుయేల్, రాయ్‌లక్ష్మీ, సోనూ సూద్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సంతోష్ శ్రీనివాస్ వహిస్తున్నారు. నిర్మాణ సంస్థ సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గొర్రేల సుబ్రమణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జనవరి 15న విడుదల కానుంది.
మహత్ రాఘవేంద్ర హీరోగా రూపొందిన సినిమా ‘సైకిల్’. ఈసినిమాలో బిగ్‌బాస్ ఫేం పునర్నవి భూపాలం, శ్వేతా వర్మ హీరోయిన్లుగా నటించారు. ఆట్ల అర్జున్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రామ్ ప్రసాద్, నవీన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ లవ్ అండ్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి పండుగ తర్వాత అంటే ఈ నెల 15న విడుదల కానుంది. మొత్తానికి జనవరిలో సినీ ప్రియులకు పండుగే పండుగ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments