HYD:ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్.. ఎంతమంది మిలియనీర్లు వున్నారో తెలుసా..?

  • IndiaGlitz, [Wednesday,April 19 2023]

తెలుగువారి భాగ్యనగరం, హైటెక్ సిటీ హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచింది. భాగ్యనగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు వున్నట్లు హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ తెలిపింది. ‘‘world wealthiest cities report 2023’’ పేరుతో ఈ సంస్థ మంగళవారం ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోని 97 నగరాలు, పట్టణాలు చోటు దక్కించుకున్నాయి. ఈ లిస్ట్‌లో అమెరికాలోని న్యూయార్క్ నగరం అగ్రస్థానంలో నిలిచింది. డిసెంబర్ 31, 2022 నాటికి ఇక్కడ 3,40,000 మంది మిలియనీర్లు వున్నట్లు హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ వెల్లడించింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన అత్యధిక నగరాలు ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.

టాప్ 10లో వుంది ఇవే :

ఆ తర్వాత జపాన్ రాజధాని టోక్యో (2,90,300), శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా (2,85,000), లండన్ (2,58,000), సింగపూర్ (2,40,100), లాస్ ఏంజెల్స్ (2,05,400), హాంకాంగ్ (1,29,500), బీజింగ్ (1,28,000), షాంఘై (1,27,000) సిడ్నీ (1,26,900) టాప్ 10లో నిలిచాయి. ఇక మనదేశం నుంచి ముంబై (59,400) మంది మిలియనీర్లతో ముంబై లిస్ట్‌లో 21వ స్థానంలో నిలిచింది. తర్వాత ఢిల్లీ (30,200) 36వ స్థానంలో, బెంగళూరు (12,600) 60వ స్థానంలో, కోల్‌కతా (12,100)మందితో 63వ స్థానంలో, ఆ తర్వాత మన హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచాయి. 2012 నుంచి 2022 మధ్య హైదరాబాద్‌లో మిలియనీర్ల సంఖ్య 78 శాతం మేర పెరిగింది. 2000వ సంవత్సరంలో ఈ జాబితాలో తొలి స్థానంలో వున్న లండన్ ఇప్పుడు నాలుగో స్థానానికి దిగజారింది.