YS Jagan:సీఎంగా నాలుగేళ్లు .. మళ్లీ నువ్వే రావాలి జగనన్న, ట్విట్టర్ టాప్ ట్రెండ్స్‌లోకి
- IndiaGlitz, [Tuesday,May 23 2023]
తండ్రి మరణం, సీబీఐ , ఐటీ కేసులు, జైలు జీవితం ఇలా సవాలక్ష సమస్యలను ఎదుర్కొంటూనే తన కష్టంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. 2014లో స్వల్ప తేడాతో పవర్ దూరమైనా ఏమాత్రం అధైర్యపడకుండా అధికార పార్టీపై పోరాటం చేసి, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా తన లక్ష్యాన్ని ముద్దాడారు. 2019 మే 23న విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనీవిని ఎరుగనీ రీతిలో భారీ మెజారిటీతో అధికారాన్ని అందుకున్నారు. 151 అసెంబ్లీ స్థానాలను, 22 ఎంపీ సీట్లను గెలుచుకుని ఎన్టీఆర్ తర్వాత అంతటి భారీ మెజారిటీని అందుకున్న వ్యక్తిగా వైఎస్ జగన్ రికార్డుల్లోకెక్కారు. 2019 మే 30న నవ్యాంధ్ర ప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సంక్షేమమే ఎజెండాగా నవరత్నాల పథకంతో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును జమ చేస్తూ ముందుకు సాగుతున్నారు.
సీఎంగా నాలుగేళ్లు పూర్తి చేసుకోనున్న జగన్ :
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు గడుస్తున్న సందర్భగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తున్నారు. మేనిఫెస్టోను దైవంగా భావిస్తూ ఇచ్చిన హామీల్లో 98.4 శాతం నెరవేర్చారు జగన్. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని అందుకునేందుకు గాను వడివడిగా ముందుకు సాగుతున్నారు. హామీలు అమలు చేశామని తమకే ధైర్యంగా ఓట్లేయాలని ప్రజలను కోరుతున్నారు జగన్. గడప గడపకూ మన ప్రభుత్వం , మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాల ద్వారా కేడర్‌ను ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి.
ట్విట్టర్‌ను ఊపేస్తున్న #YSRCPAgain2024:
ఇదిలావుండగా.. జగన్ అధికారాన్ని అందుకుని 4 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాయి. నెటిజన్లు కూడా జగన్‌కు అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో #YSRCPAgain2024 అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతూ నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతోంది. నిమిషాల వ్యవధిలోనే ఈ హ్యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లోకి రావడం, జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవడంతో వైసీపీ కేడర్ సంతోషం వ్యక్తం చేస్తోంది. రావాలి జగన్.. కావాలి జగన్ అంటూ నెటిజన్లు ముఖ్యమంత్రిని దీవిస్తున్నారు. గత నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అందించిన పథకాలను కూడా వారు చర్చించుకుంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్‌కు అండగా నెటిజన్లు :
జగన్ ప్రతిపక్షనేతగా వున్నప్పుడు కూడా ప్రజలు సోషల్ మీడియా ద్వారా ఆయన అధికారాన్ని అందుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. సోషల్ మీడియా ద్వారా జగన్‌కు అండగా నిలిచి ప్రత్యర్ధి పార్టీలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఇప్పుడు ఎన్నికల సీజన్ కావడంతో మరోసారి జగనన్నను సీఎంను చేసేందుకే సోషల్ మీడియాలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు నెటిజన్లు. ‘‘వై నాట్ 175’’, ‘‘వైసీపీ అగైన్ 2024’’ నినాదాలను జనంలోకి బలంగా తీసుకెళ్తున్నారు.