4 రాష్ట్రాల సీఎంలు సహా కరోనాకు చిక్కిన బడా నేతలు
Send us your feedback to audioarticles@vaarta.com
భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విధ్వంసం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోతోంది. గతేడాది లక్ష కేసులు వస్తేనే జనం భయపడి పోయారు. కానీ ఇప్పుడు మూడు లక్షలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరు కోవిడ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా బడా బడా రాజకీయ నేతలంతా కరోనా కోరల్లో చిక్కుకుపోయారు. ఇప్పటికే యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు ఇప్పటికే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ తాజాగా ఈ లిస్టులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చేరిపోయారు. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా కూడా..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చికిత్స నిమిత్తం ఆయనను ఢిల్లీలోని ఏయిమ్స్‌కు తరలించారు. మన్మోహన్ సింగ్ ఇప్పటికే వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్నారు. అయినా కూడా మన్మోహన్ కరోనా బారిన పడ్డారు. అయితే వ్యాక్సినేషన్ తీసుకుని ఉండటం వల్ల ఆయన త్వరగా కోలుకునే అవకాశముందని వైద్యులు భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కోవిడ్ లక్షణాలు స్పల్పంగా కనిపించినట్టు రాహుల్ మంగళవారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ ఇటీవల రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సైతం మంగళవారం కరోనా బారిన పడ్డారు. రెండ్రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం కరోనా పాజిటివ్ బారిన పడ్డారు.
నలుగురు సీఎంలకు కరోనా..
ఏకంగా దేశంలో నలుగురు ముఖ్యమంత్రులు కరోనా బారిన పడ్డారు. వీరిలో కర్ణాటక సీఎం యడ్యూరప్ప రెండో సారి కరోనా బారిన పడటం గమనార్హం. గత ఏడాది ఆగస్ట్ 2న ఆయన కరోనా బారినపడ్డారు. అనంతరం మణిపాల్ ఆసుపత్రిలో చేరి తొమ్మిది రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. తాజాగా ఆయన మరోసారి కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే ఆయన కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. అయినా కూడా ఆయన కరోనా బారిన పడ్డారు. ఇక యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం కరోనా బారిన పడ్డారు. తన కార్యాలయంలో పని చేస్తున్న ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో యోగి కూడా పరీక్ష చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం కరోనా బారిన పడ్డారు. తనకుపాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కోజికోడ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఎన్నికలే కొంప ముంచాయా?
నలుగురు సీఎంలలో యూపీ సీఎం యోగి మినహా ముగ్గురు కరోనా బారిన పడటానికి కారణం ఎన్నికలేనని తెలుస్తోంది. కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాబోయే ఉపఎన్నికల కోసం బెలగావిలో ప్రచారం చేస్తుండగా.. ఆయనకు జ్వరం వచ్చింది. దీంతో యాంటిజెన్ పరీక్ష చేయగా తొలుత నెగిటివ్ అని తేలింది. దీంతో ఆసుపత్రికి వెళ్ళగా మరోసారి టెస్ట్ చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక తమిళనాడులో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అక్కడి సీఎం పళనిస్వామి కూడా కరోనా బారిన పడ్డారు. ఇక కేరళలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక్కడి సీఎం పినరయి విజయన్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే అటు పళనిస్వామి, ఇటు విజయన్‌కు కరోనా రావడానికి ఎన్నికలే కారణమని చెప్పలేము కానీ ఇటీవలి కాలం వరకూ వీరివురూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా సోకడానికి మాత్రం సాగర్ ఉప ఎన్నికే కారణమనడంలో ఏమాత్రం సందేహం లేదు. హాలియా సభలో పాల్గొన్న తరువాతనే ఆయన కరోనా బారిన పడ్డారు. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఈ ముగ్గురు సీఎంలు కరోనా బారిన పడటానికి ఎన్నికలే కారణమని చెప్పాలి.
ఏప్రిల్ 1 నుంచి 14 వరకూ డేటాను పరిశీలిస్తే..
ప్రభుత్వం, ఎన్నికల సంఘం కలిసి సంయుక్తంగా ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టాయి. కరోనా ఈ స్థాయిలో విజృంభించడానికి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలు కారణంగా కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కారణమవుతున్నాయి. ఈ ఎన్నికల కోసం దాదాపు రెండు నెలల పాటు విస్తృత ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల కార్యక్రమం వలన వ్యాపించిన కరోనా వైరస్ ప్రజలకు ప్రాణంతకంగా మారినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 14 వరకు ఈ ఐదు రాష్ట్రాల డేటాను పరిశీలిస్తే.. పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు 420%, అస్సాంలో 532%, తమిళనాడులో 159%, కేరళలో 103%, పుదుచ్చేరిలో 165% పెరిగాయని తెలుస్తోంది. సగటున, ఈ ఐదు రాష్ట్రాల్లో మరణాలు కూడా 45% పెరిగాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments